క్రేజీ మల్టీస్టారర్‌లో మోహన్ బాబు.. ఏదో ఒకరోజు తప్పకుండా, ఆ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్!
భారత చిత్ర పరిశ్రమలోని దిగ్గజ దర్శకులలో మణిరత్నం ఒకరు. ఆయన చిత్రాలు, దర్శకత్వ శైలి ఒకప్పుడు అభిమానులందరినీ ఫిదా చేశాయి. మణిరత్నం దర్శత్వంలో ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాలు వచ్చాయి. కానీ చాలా కాలంగా హిట్ లేకుండా ఉన్న మణిరత్నంకు గత ఏడాది విడుదలైన నవాబ్ చిత్రం ఊరటనిచ్చింది. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నవాబ్ తర్వాత మణిరత్నం మరో క్రేజీ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

మొదలైన ప్రీ ప్రొడక్షన్
చారిత్రాత్మక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా తాను చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు మణిరత్నం చాలా రోజుల క్రితమే ప్రకటించారు. గత ఏడాది విడుదలైన నవాబ్ చిత్రం తర్వాత మణిరత్నం ఈ చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభించారు. తాజగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అవసరమైన నేటీనటుల ఎంపికలో మణిరత్నం నిమగ్నమై ఉన్నారట.

కీలక పాత్రలో మోహన్ బాబు
ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం మణిరత్నం మోహన్ బాబుని సంప్రదించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు ఎలాంటి విలక్షణ నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకు అందించిన పాత్రలో పరకాయప్రవేశం చేసి నటించగల సత్తా మోహన్ బాబుకు ఉంది. మోహన్ బాబు డైలాగ్ డెలివరీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటి నటుడిని ఈ హిస్టారికల్ చిత్రంలో తీసుకుంటే బావుంటుందని మణిరత్నం భావిస్తున్నారట.

రాజ రాజ చోళ1
ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి పొన్నియన్ సెల్వన్ నవలని రచించారు. ఇందులో క్రీ.శ 947కు చెందిన మొదటి రాజరాజ చోళ వైభవాన్ని అద్భుతంగా వర్ణించారు. అద్భుతమైన తమిళ నవలల్లో ఇది కూడా ఒకటి. ఈ నవల తనని బాగా ఆకర్షించిందని, ఎదో ఒకరోజు ఈ నవల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తానని మణిరత్నం పలు ఇంటర్వ్యూలలో ప్రకటించారు. పొన్నియన్ సెల్వన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా మణిరత్నం తెలిపారు.

బడా హీరోల పేర్లు
సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ ని రూపొందించాలనేది మణిరత్నం ప్లాన్. ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్, విక్రమ్, శింబు లాంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. నవాబ్ చిత్రాన్ని కూడా శింబు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి లాంటి హీరోలతో మల్టీస్టారర్ గా రూపొందించారు. ఈ భారీ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











