Manobala dies at 69 మనోబాల సార్.. నీ మరణంతో గుండె ముక్కలైంది.. రజనీ, రాధిక, సినీ హీరోలు ఏమన్నారంటే?
నటుడు, దర్శకుడు, నిర్మాత మనోబాల మరణవార్తతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. వృద్దాప్య సంబంధిత వ్యాధులు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఏడాది జనవరి నుంచి చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం మే 3వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తీవ్ర విషాదంలో మునిగిన సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఆయన గురించి రజనీకాంత్, ఇతర ప్రముఖులు ఏమన్నారంటే..
రజనీకాంత్ ఏమన్నారంటే?:మనోబాల మృతితో తీవ్ర విషాదానికి లోనైన రజనీకాంత్ ట్వీట్ చేస్తూ.. నా ప్రియ మిత్రుడు మనోబాల మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. ఆయన గొప్ప డైరెక్టర్, నటుడు. ఆయన కుటుంబానికి మనోధైర్యం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ తలైవా రజనీకాంత్ ట్వీట్ చేశారు.

భారతీ రాజా కన్నీరు మున్నీరు:మనోబాలకు గురువు లాంటి దర్శకుడు భారతీ రాజా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. భారతీ రాజా వద్దనే దర్శకత్వ శాఖలో చేరి.. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే నటుడిగా మనోబాల కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనోబాల మరణ వార్త తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో స్పందిస్తూ.. నా శిష్యుడి మరణం నా జీవితంలో అత్యంత దుర్భరమైన సంఘటన. ఆయన మరణం తమిళ పరిశ్రమకు తీరని లోటు అని భారతీ రాజా ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాధిక శరత్ కుమార్ ఎమోషనల్‌గా:మనోబాల మృతిపై రాధిక శరత్ కుమార్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. మనోబాల మరణవార్తతో నా గుండె పగిలినంత పనైంది. ఈ ఉదయమే ఆయన గురించి వాకబు చేశాను. ఆయనను కలుసుకోవాలని అనుకొన్నాను. ఆయనను కలుసుకొనే ప్రయత్నం చేశాను. కానీ ఇంతలోనే ఇలాంటి దుర్వార్తను వినాల్సి వచ్చింది. వ్యక్తిగతం, ప్రొఫెషనల్‌గా నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన నుంచి నేను చాలా నేర్చుకొన్నాను. ఎంతో సమయం నవ్వులతో గడిపాం. ఇద్దరం పోట్లాడుకొన్నాం. మా ఇద్దరి మధ్య ఎన్నో అనుభూతులు ఉన్నాయి అని రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ దిగ్బ్రాంతితో..:మనోబాల మరణవార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. మంచి మనిషి. గత నవంబర్‌లో ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన ఉన్నంత సేపు చుట్టు పాజిటివ్ ఎనర్జీ ఉండేది. ప్రతీ నిమిషం నవ్వులతో మునిగిపోయేవాళ్లం. ఆయన గురించి తెలిసిన ప్రతీ ఒక్కరు మిస్ అవుతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగంతుడిని కోరుకొంటున్నాను అని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు.
దుల్కర్ సల్మాన్ ఏమన్నారంటే?:యువ హీరో దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేస్తూ.. మనోబాలా సార్.. నీవు చాలా మంచి మనిషివి. దాయార్ధ హృదయుడవు. అందరికీ ప్రేమను, నవ్వులు పంచుతుండేవాడివి. మీతో పనిచేసిన ప్రతీ సినిమా సమయంలో నాకు మంచి అనుభూతులను పంచారు అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
గౌతమ్ కార్తీక్ ట్వీట్:డైరెక్టర్, యాక్టర్ మనోబాల ఇకలేరనే విషయంతో గుండె ముక్కలైంది. మీతో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నాను సార్. మీరు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. మనోబాల కుటుంబానికి, స్నేహితులకు, ఆయనను ప్రేమించే ప్రతీ ఒక్కరికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని హీరో గౌతమ్ కార్తీక్ అన్నారు.
బహుముఖ ప్రజాశాలి మనోబాల సార్ లేరంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన మరణ వార్త తీవ్ర విషాదానికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు మనోబలాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











