హాలీవుడ్‌కి రెడీ: మురుగుదాస్
ప్రస్తుతం అతడు తెలుగు, తమిళ చిత్ర రంగాల్లో లేటెస్ట్ సెన్సేషన్. ఐదున్నర అడుగుల ఎత్తు, పీలగా ఉండే ఈ యువకుడికి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు సినీజనం ఆశ్చర్యపోయారు. తన తొలి తమిళ చిత్రం రమణ (తెలుగులో ఠాగూర్) ద్వారా తన సత్తా చాటుకున్న మురుగుదాస్ ఆ తర్వాత గజనీ చిత్రం ద్వారా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ తనేమిటో మరోమారు రుజువు చేసుకున్నాడు. స్టాలిన్ చిత్రం కూడా ఫర్లేదు అనిపించుకోవడంతో మురుగుదాస్ ఇక తన కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు. హాలీవుడ్‌లో ఒక చిత్రం చేయడానికి తన దగ్గర కథ రెడీ అని ప్రకటించేశాడు మురుగుదాస్. అయితే, ఆ సినిమా ఏ విధంగా ఉంటుందో మాత్రం ప్రస్తుతానికి చెప్పలేనని అంటున్నాడీ దర్శకుడు. అతడి ప్రకటన తమిళ చిత్రసీమలో ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
మురుగుదాస్‌కు కాపీ దర్శకుడు అని కూడా తమిళనాట పేరుంది. రమణ చిత్రం సబ్జెక్ట్ గురించి అక్కడ కొన్ని వూహాగానాలు ఉండగా, ఇంగ్లీష్‌లో మెమెంటో చిత్రాన్ని గజనీగానూ, ఆ తర్వాత ఇంగ్లీష్‌లో వచ్చిన పే ఇట్ ఫార్వార్డ్ చిత్రంలోని ప్రధాన అంశాన్ని స్టాలిన్ కోసం వాడుకున్న మురుగుదాస్ హాలీవుడ్ కోసం సొంత సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడంటే కొందరు నమ్మలేకపోతున్నారు. ఇంగ్లీష్ సినిమాని కాపీ చేసి ఇంకో ఇంగ్లీష్ సినిమా తీస్తే హాలీవుడ్‌లో చెల్లుబడి అవుతాడా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు తమిళ చిత్రసీమలో కొందరు.


Click it and Unblock the Notifications