వైఎస్ జగన్ ఓటమితో విశాల్‌కు ఎదురు దెబ్బ.. తమిళ హీరోను ఆటాడుకుంటోన్న నెటిజన్లు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలతో వైసీపీ శ్రేణులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయాయి. ఎంతో మంచి చేసినా ఇలా జరిగిందంటూ స్వయంగా జగన్ భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు కూటమి విక్టరీతో గతంలో వైసీపీ గెలుస్తుందంటూ చెప్పిన వారిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. జ్యోతిష్యుడు వేణుస్వామి, ఆరా మస్తాన్ తదితరులు ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ లిస్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా చేరాడు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు తను నటించిన రత్నం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాల్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ వైఎస్ జగన్ గెలిచి సీఎం అవుతారని ధీమాగా చెప్పారు. అలాగే ఆయనపై జరిగిన రాయి దాడి ఘటనను ఖండించారు. గతంలోనూ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని.. కానీ ఆయన భయపడే రకం కాదని విశాల్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాను సపోర్ట్ చేస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని.. జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని , ఆయనను ఒక వ్యక్తిగా ఫాలో అవుతున్నట్లు చెప్పారు.

వైఎస్సార్ చనిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు జగన్ ఏం చేశారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నది గమనిస్తున్నానని విశాల్ పేర్కొన్నారు. రాజకీయంగా జగన్ ఎన్నో చూశారని.. అన్నింటికీ ధైర్యంగా నిలబడ్డారని రాయలసీమ బిడ్డకు ఆ మాత్రం ధైర్యం ఉంటుందని ఆయన ప్రశంసించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను బయటకు తీస్తున్న కూటమి నేతలు, కార్యకర్తలు విశాల్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు బయటకొచ్చి ప్రకటన చేయండి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు .. ఆంధ్రప్రదేశ్‌లో కొందరు వైసీపీ నేతలను కూటమి కేడర్ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ ఇళ్ల వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. వంశీ అనుచరులు రెచ్చగొట్టడంతోనే తమ వాళ్లు రియాక్ట్ అయ్యారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్ద వెంకట్రావు తెలిపారు. ఉద్రిక్తతల కారణంగా వంశీ ఇంటి వద్ద పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించారని.. వారు తమపైనా లాఠీ ఛార్జీ చేశాయని ఎమ్మెల్యే వెల్లడించారు. సీఆర్పీఎఫ్ బలగాల దాడిలో తమ వాళ్లు కొందరు గాయపడ్డారని.. కొందరు పోలీసులు ఇంకా వైసీపీకి కొమ్ము కాస్తున్నారని యార్లగడ్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడివాడలోనూ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఇదే రకమైన పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని నాని గతంలో సవాల్ చేశారని.. ఇప్పుడు ఓడిపోవడంతో ఆయన తన సవాల్‌ను నిలబెట్టుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొడాలి నానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందని.. ఇది ట్రైలర్ మాత్రమేనని వారు హెచ్చరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలిగిన వారు, ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వారు భయాందోళనలకు గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించి కేడర్‌ను నియంత్రించాలని కొందరు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











