హీరోకి, అతడి భార్యకు క్షమాపణలు చెప్పా.. అయినా వదల్లేదు.. అంతా ఫేక్ అంటున్న హీరోయిన్!
హీరోయిన్ నిక్కీ గల్రాని తమిళ, మలయాళీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. నిక్కీ గల్రాని తెలుగులో నటించింది చాలా తక్కువ. ఆమె ఫోకస్ మొత్తం తమిళ, మలయాళీ చిత్రాలపైనే పెట్టింది. తెలుగులో సునీల్ సరసన కృష్ణాష్టమి చిత్రంలో నటించింది. అన్ని చిత్ర పరిశ్రమల్లో మీటూ ఉద్యమం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నిక్కీ గల్రాని రంగం హీరో జీవాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఘాటుగా స్పందించిన నిక్కీ క్లారిటీ ఇచ్చింది.

నిక్కీ గల్రాని పేరుతో
నిక్కీ గల్రాని పేరుతో కొందరు ఇంస్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వివాదాస్పద పోస్ట్ పెట్టారు. అందులో నిక్కీ గల్రాని హీరో జీవా నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. నిక్కీ గల్రాని, జీవా మధ్య పెద్ద కథే జరిగినట్లు ఆ పోస్ట్ లో ఉంది. దీనిపై నిక్కీ గల్రాని తీవ్రంగా స్పందించింది. చాలా మంది హీరోయిన్లు మీటూ వేదికగా హీరోలపై ఆరోపణలు చేస్తుండడంతో.. నిక్కీ గల్రాని చేసినట్లు వస్తున్న ఆరోపణలు కుండా నిజం అని నెటిజన్లు నమ్ముతున్నారు.

ఎందులో ఏముందంటే
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. నాకు జీవా నటించిన గొరిల్లా చిత్రంలో అవకాశం వచ్చింది. అందులో నాది చెల్లెలు పాత్ర కావడంతో ఒప్పుకోలేదు. నేను గతంలో జీవాపై మీటూ ఆరోపణలు చేసిన కారణంగా నాకు ఇప్పుడు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. మీటూ ఆరోపణలపై నేను జీవాకు, అతడి భార్యకు కూడా క్షమాపణలు చెప్పాను. జీవాపై ఆరోపణలు చేసిన పోస్ట్ ని కూడా సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించాను. అయినా నాపై పగ పెంచుకుని అవకాశాలు రాకుండా చేస్తున్నారు.

అంతా ఫేక్
కాలకప్పు 3 అనే చిత్రంలో కూడా అవకాశం రాకుండా చేశారు. దీని గురించి నా అభిమానులు ఎవరూ చింతించవద్దు అని నిక్కీ గల్రాని పేర్కొన్నట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇదే నిజం అని నమ్ముతుండడంతో నిక్కీ గల్రాని స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. వైరల్ అవుతున్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేసింది. అసలు ఇది తన ఇంస్టాగ్రామే కాదు అని నిక్కీ గల్రాని తెలిపింది.

మంచి స్నేహితుడు
జీవా నాకు మంచి స్నేహితుడు. అతడిపై నేను ఎప్పుడూ మీటూ ఆరోపణలు చేయలేదు. పనీపాటా లేనివాళ్లు ఇలాంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి గందరగోళం సృష్టించవద్దు. ఉపయోగపడే పనులు చేయడానికి ప్రయత్నించండి అంటూ నిక్కీ గల్రాని ఘాటుగా స్పందించింది. తనతో ఏ హీరో తప్పుగా ప్రవర్తించలేదు. నేను ఎవరిపై నిందలు వేయలేదు అని నిక్కీ క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











