ముఖ్యమంత్రిని తిట్టాడంటూ స్టార్ హీరోపై కేసు
ముఖ్యమంత్రిని,ప్రభుత్వాన్ని విమర్శిస్తావా అంటూ తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ పై పోలీస్ కేసు నమోదు చేసారు. వివరాల్లోకి వెళితే...అన్నాడీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న డీఎండీకే అధినేత విజయకాంత్‌పై ఆ పార్టీ న్యాయవాదులు చెన్నై కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పోటీచేసిన డీఎండీకే, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో జయ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో విజయకాంత్ అన్నాడీఎంకే ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జయలలితపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అనుచితంగా ప్రవర్తించారంటూ గురువారం ఆయన్ను స్పీకర్ 10 రోజుల పాటు సభ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జయలలితను తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీన్ని అన్నాడీఎంకే న్యాయ విభాగం తీవ్రంగా పరిగణిం చింది. తూత్తుకుడికి చెందిన సుప్రీం కోర్టు న్యాయవాదులు జ్ఞానముత్తు, కృష్ణమూర్తి శనివారం చెన్నై కోయంబేడు పోలీస్ స్టేషన్లో విజయకాంత్‌పై ఫిర్యాదు చేశారు. జయలలిత పరువుకు భంగం కలిగించే విధంగా విజయకాంత్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి, ఆయనపై 504, 505, 205, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. పోలీసులు స్పందించకుంటే సోమవారం కోర్టును ఆశ్రయిస్తామని జ్ఞానముత్తు చెప్పారు. ఇదిలావుండగా అసెంబ్లీ నుంచి సస్పెండైన క్రమంలో, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం తనకు కేటాయించిన కారును ఆయన వెనక్కు ఇచ్చేశారు.


Click it and Unblock the Notifications











