‘సినిమా పబ్లిసిటీ కోసం నన్ను మోసం చేసింది... ఆమెకు ఓ లవర్ ఉన్నాడు’
కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టింది. ఈ షోలో అత్యంత వివాదాస్పద కంటెస్టెంటుగా నటి వనితా విజయ్‌కుమార్‌పై ముద్ర పడింది. నిజ జీవితంలో తన తండ్రి, మాజీ భర్తతో గొడవలు పడి వార్తల్లోకి ఎక్కిన వనితా... బిగ్ బాస్ హౌస్‌లో సైతం అదే వైఖరి కొనసాగిస్తోంది.
ప్రముఖ దక్షిణాది నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల కూతురైన వనితా.... కాంట్రవర్సల్ లేడీగా గతంలోనూ వార్తల్లోకి ఎక్కారు. ఆ మధ్య ఓ ఇంటి విషయంలో తన తండ్రితో గొడవపడి రోడ్డెక్కిన ఆమె, భర్తతో కూడా అడ్జెస్ట్ కాలేక గొడవలు పడి విడిపోయిన సంగతి తెలిసిందే.

వనితా బండారం బయటపెట్టిన రాబర్ట్
వనితా మూడో భర్త అంటూ డాన్స్ మాస్టర్ రాబర్ట్ మీద గతంలో రూమర్స్ వినిపించాయి. ప్రస్తుతం వనితా బిగ్ బాస్ షోలో ఉన్న నేపథ్యంలో తాజాగా రాబర్ట్ ఓ తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను వనితా చేతుల్లో ఎలా మోసపోయానో వెల్లడించారు. రాబర్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి.

సినిమా ప్రమోషన్ కోసం రూమర్స్ క్రియేట్ చేసింది
రాబర్ట్ దర్శకత్వంలో వనితా విజయ్ కుమార్ నిర్మాతగా ‘ఎంజీఆర్ శివాజీ రజిని కమల్' అనే సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు పబ్లిసిటీ తేవడానికి రూమర్స్ స్ప్రెడ్ చేయాలనే ప్లాన్ వేసిందట. అందులో భాగంగా తనకు, ఆమెకు ఎఫైర్ ఉన్నట్లు వార్తలు సృష్టించిందని, ఆ సమయంలోనే నేను ఆమె మూడో భర్త అనే పుకార్లు షికార్లు చేశాయని రాబర్ట్ తెలిపారు. నాకు చెప్పకుండా ఇలాంటి పని చేసి మోసం చేసిందని రాబర్ట్ చెప్పుకొచ్చారు.

నా భార్యను కూడా కన్విన్స్ చేసింది
వనితా, రాబర్ట్ ఎఫైర్ అంటూ వార్తలు చూడగానే... నా భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. నాతో గొడవపడటం మొదలు పెట్టింది. ఆ సమయంలో స్వయంగా వనితా వచ్చి తన భార్యను కన్విన్స్ చేసింది, సినిమాను ప్రమోట్ చేయడానికే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసినట్లు చెప్పడంతో నా భార్య శాంతించింది.. అని రాబర్ట్ గుర్తు చేసుకున్నారు.

ఆమెకు రియల్ లవర్ ఉన్నాడు
గత పదిహేను, ఇరవై సంవత్సరాలుగా వనితా ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. తాను ఒంటరిగా ఉన్నట్లు ఆమె చెబుతున్న వార్తల్లో నిజం లేదు అని రాబర్ట్ స్పష్టం చేశారు. ఆమెకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. అందుకే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. అలాంటి వ్యక్తి కాబట్టే ‘బిగ్ బాస్ 3' షోలో అవకాశం వచ్చింది అని రాబర్ట్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











