Rajini170 కన్ఫర్మ్.. సూపర్‌స్టార్‌ను డైరెక్ట్ చేసేది ఎవరో తెలుసా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సినిమాలు హిట్టా ఫట్టా అనే విషయాన్ని పట్టించుకోకుండా సినిమాల వేగం పెంచారు. దర్బార్ రిలీజ్ తర్వాత వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం దర్శకుడు సిరుతాయ్ శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168వ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది.
ఇక రజనీకాంత్ 169వ చిత్రం తన సన్నిహితుడు, సహచర నటుడు కమల్ హాసన్ నిర్మాతగా ఓ సినిమా రూపొందనున్నది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఇదే ఊపులో 170వ సినిమాకు కూడా రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి రెండేళ్ల క్రితమే రజనీకాంత్, లారెన్స్ తమ సినిమా గురించి సంప్రదింపులు జరిపారు. కథలో మార్పుల కారణంగా లారెన్స్ సినిమాను పక్కన పెట్టి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు అవకాశం ఇచ్చారు. తాజాగా లారెన్స్ మరోసారి కొత్త స్క్రిప్టును చెప్పగా అందుకు రజనీ సంతృప్తి చెందినట్టు, వెంటనే సినిమాను చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం సిరుతాయ్ శివ దర్శకత్వంలో అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. కరోనవైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల నిరవధికంగా వాయిదా వేశారు. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనా, కుష్బూ, ప్రకాశ్ రాజ్, కీర్తీ సురేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ రజనీకాంత్ కూతురిగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











