రజనీకాంత్ 'రోబో' టోటల్ గా ఎంత కలెక్టు చేసిందంటే...
గత ఏడాది అక్టోబరు 1న విడుదలైన రజనీకాంత్ 'రోబో' రికార్డు కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి ఎంత కలెక్టు చేసిందనేది లెక్క పెడితే..రూ.375 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తేల్చారు. సన్‌టీవీ నెట్‌వర్క్ మూడో త్రైమాసిక ఫలితాలు ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. సన్ టీవీ నికర లాభం 48 శాతం పెరిగి రూ.225 కోట్లకు చేరడానికి 'రోబో' సినిమా ఉపకరించింది. రూ.132 కోట్లు ఖర్చు పెట్టి 'రోబో'ను నిర్మించారు. మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. తమిళంలో 'ఎందిరన్'గా వచ్చిన 'రోబో' హిందీ, తెలుగు భాషల్లోనూ సంచలనం సృష్టించింది. తమిళంలో 1400 తెరలపై ప్రదర్శిస్తే..ప్రపంచవ్యాప్తంగా 2400పై చిలుకు థియేటర్లలో 'రోబో' ప్రదర్శితమైంది. మూడు భాషల్లో తొలి వారం వసూళ్లు రూ.117 కోట్లు వచ్చినట్లు సన్‌టీవీ సీఓఓ అజయ్ విద్యాసాగర్ తెలిపారు. చిత్ర విడుదలకు కొద్ది రోజుల ముందు గూగుల్‌లో రోబో గురించే ఎక్కువగా సెర్చ్ చేసినట్లు చెప్పారు. మొత్తానికి ఈ చిత్ర నిర్మాత కళానిధి మారన్ కి ఈ చిత్రం కనక వర్షం కురిపించింది.


Click it and Unblock the Notifications











