రజనీ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్... కత్తి పోట్లు, పరిస్థితి విషమం!
రజనీకాంత్ నటించిన 'పేట', అజిత్ నటించిన 'విశ్వాసం' చిత్రాలు తమిళనాడులో గురువారం గ్రాండ్‌గా విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెల్లవారుఝామున అభిమానుల కోసం బెనిఫిట్ షోలు వేశారు. అయితే కొన్ని చోట్ల రెండు థియేటర్లు ఉన్న ప్రాంతంలో రజనీ, అజిత్ ఎదురు పడటంతో ఇరు వర్గాల అభిమానుల మధ్య గొడవలు జరిగాయి.
ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన రజనీకాంత్ బేనర్‌ను కొందరు చించివేయడంతో ఇది అజిత్ అభిమానుల పనే అని భావించిన రజనీకాంత్ ఫ్యాన్స్ గొడవకు దిగారు. చివరకు ఇది ఉద్రిక్తంగా మారి కత్తిపోట్లకు దారితీసినట్లు సమాచారం.

ఇద్దరి పరిస్థితి విషమం
కత్తి పోట్లకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని మొదలైన చిన్న వివాదం చివరకు పెను వివాదంగా మారి ఒకరిపై ఒకరు కత్తులతో దాడిచేసుకునే స్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది.

థియేటర్ల వద్ద బందోబస్తు..
గొడవలు జరిగిన విషయం తమిళనాడు వ్యాప్తంగా వ్యాపించడంతో ఇతర ప్రాంతాల్లోనూ అభిమానుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో సున్నితమైన ప్రాంతాల్లోని థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చెన్నై, వేలూరులో గొడవలు
చెన్నైలోని రోహిని థియేటర్ వద్ద, వేలూరులోని మరో థియేటర్ వద్ద అభిమానుల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఆయా సంఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గొడవలకు కారణమైన వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

రజనీ, అజిత్ స్పందించాల్సి ఉంది
పండగ సమయంలో సరదాగా సినిమా చూసి ఎంజాయ్ చేయాల్సింది పోయి ఇలా గొడవలు జరుగడం చూసి అంతా విస్మయపోతున్నారు. ఈ సంఘటనలపై ఇటు రజనీకాంత్ కానీ, అటు అజిత్ కానీ స్పందించలేదు. ఫ్యాన్స్ సంయమనం పాటించాలని వారు ప్రకటన చేస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











