వినాయక ఉత్సవాల్లో ఘర్షణ.. సూపర్ స్టార్ అభిమాని దారుణ హత్య
భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే కోలీవుడ్‌లో అభిమానులు కొంత ఉద్వేగానికి లోనవుతుంటారు. తమ అభిమాన నటుల కోసం ఎన్నో పనులు చేస్తుంటారు. గతంలో హీరోయిన్లకు గుళ్లు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అభిమానంతో దాడులు చేసుకున్న ఘటనలూ జరిగాయి. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీ మిగిలిన వాటి కంటే కొంత ప్రత్యేకమైనది చెబుతుంటారు. తాజాగా తమిళనాడులో ఓ అభిమాని దారుణ హత్యకు గురయ్యాడు. అది కూడా వినాయక చవితి ఉత్సవాల్లో కావడం గమనార్హం.
తమిళనాడులోని లాల్గుడిలో నివాసం ఉంటున్న పార్ధసారథి(20) అనే యువకుడు సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమాని. ఆయన సినిమా వచ్చిందంటే చాలు.. ఫ్లెక్సీలు కట్టడం సహా పండుగలా నిర్వహిస్తుంటాడు. ఇక, ప్రస్తుతం జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి కాలనీలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆరోజు నుంచి నిత్యం పూజలు చేయిస్తున్నారు. దీంతో కాలనీ అంతా సందడిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఊహించని ఘటన జరిగింది.

అయితే, మంగళవారం రాత్రి పార్ధసారథి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో అతడి స్నేహితుల్లో ఒకరైన దినేష్ కుమార్ వచ్చి కత్తితో దాడి చేశాడు. దీంతో పార్ధసారథికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గ మధ్యంలో పార్ధసారథి తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దినేష్ కుమార్‌ను అదుపులోనికి తీసుకున్నారు. వినాయక ఉత్సవాల్లో జరిగిన ఘర్షణే ఈ హత్యకు కారణం అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











