‘కూలింగ్ గ్లాస్ పెడతాడు.. స్లో మోషన్‌లో వస్తాడు.. రజనీకాంత్‌కి ఇంకేం తెలియదు’
సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 5 దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఈ దిగ్గజం 75 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో సమానంగా నటిస్తున్నారు. రజనీ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. తమిళంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన లిస్ట్ తీస్తే వాటిలో ఎక్కువ భాగంగా రజనీవే ఉంటాయి. ఆయన నటించిన కూలీ, జైలర్ 2 సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇవి రెండు ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి చరిత్ర తిరగరాస్తాయని తలైవా అభిమానులు భావిస్తున్నారు.
ఆధ్యాత్మక యాత్రలో రజనీ
సూపర్‌స్టార్‌గా, కోట్లాది మంది అభిమానులున్నా, వందల కోట్ల ఆస్తులున్నా రజనీకాంత్ ఒదిగే ఉంటారు. తొలి నుంచి ఆధ్యాత్మిక భావజాలం ఎక్కువగా ఉన్న రజనీ.. సినిమాలు, షూటింగ్స్ లేనప్పుడు హిమాలయాలకు వెళ్లి కొన్నాళ్లు అక్కడ ధ్యానం, భగవంతుని సేవలో తరిస్తారు. అవతార్ బాబాకు పరమ భక్తుడైన రజనీకాంత్.. తరచుగా హిమాలయాలకు వెళ్లి బాబా ఆశ్రమంలో పూజలు, ధ్యానం చేస్తుంటారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.

రజనీ నిరాడంబర జీవితం
చాలా మంది స్టార్స్ తమ వయసును కవర్ చేసుకోవడానికి విగ్గు ధరించడం, ఫారిన్‌లో స్పెషల్ ట్రీట్‌మెంట్ వంటివి చేసుకుంటూ ఉంటారు. కానీ రజనీకాంత్ సినిమాల్లో విగ్గులు ధరించినా బయట మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. ఎక్కువగా తెల్ల పంచె, షర్ట్ ధరించే కనిపిస్తారు. సినిమా ఈవెంట్స్‌కు కూడా మామూలు మనిషిలాగే వెళ్తారు. అవసరం అనుకుంటే తప్పించి మేకప్ వేసుకోరు. సినిమాల పరంగా రజనీకాంత్‌ను ఎంతమంది ఇష్టపడతారో, వ్యక్తిగా ఆయనను అంతకుమించి అభిమానిస్తారు.
వేల్పారి నవలకు ఆదరణ
రజనీకాంత్ ఇంట్లో ఉంటే పుస్తకాలు బాగా చదువుతారు. సాహిత్యంపై ఆయనకు మంచి పట్టుందని అత్యంత సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా తమిళ రచయిత ఎస్ వెంకటేశన్ రచించిన వేల్పారి నవలకు విశేష ఆదరణ లభించడంతో పాటు ఏకంగా లక్షకు పైగా కాపీలు అమ్ముడు పోవడంతో శుక్రవారం చెన్నైలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు రజనీకాంత్, శంకర్, రోహిణితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. నవ్వులు పూయించారు.
నాకేం తెలియదు
ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్ వంటి మేధావులను పిలవాల్సింది. శివకుమార్ మంచి వక్త అని.. మహాభారతంతో పాటు తిరుక్కురల్ గురించి ఏకధాటిగా 6 గంటల పాటు ప్రసంగించగలరని రజనీ అన్నారు. అలాగే కమల్ హాసన్ మేధావి అని అలాంటి ఆయనను కూడా వదిలేశారని పేర్కొన్నారు. వీరికి బదులుగా 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని, స్లో మోషన్‌లో నడవటం తప్పించి ఏం తెలియని రజనీకాంత్‌ను ఎందుకు పిలిచారా? అని ఆశ్చర్యపోయానని సూపర్‌స్టార్ తన మీద తానే సెటైర్లు వేసుకున్నారు.
రిటైర్మెంట్‌పై రజనీ వ్యాఖ్యలు
తనలో పుస్తక పఠనం గురించి స్పూర్తి నింపింది మాత్రం రామకృష్ణ ఆశ్రమమేనని రజనీ అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పుస్తకాలు చదివానని.. ఓ మిత్రుడి సలహా మేరకు వేల్పారి పుస్తకాన్ని 25 శాతం వరకు పూర్తి చేశానని పేర్కొన్నారు. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత మిగిలిన భాగం పూర్తి చేస్తానని తలైవా చెప్పారు. వేల్పారి నవల ఆధారంగా దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న సినిమా కోసం ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నానని సూపర్‌స్టార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











