101 ఏళ్ల నిస్వార్ధ దిగ్గజ కమ్యూనిస్ట్ నేత మృతి.. రజనీ కంటతడి.. సూర్య, వెట్రీమారన్ ఎమోషనల్!
సాధారణ ప్రజలకే కాకుండా, సినీ, రాజకీయ ప్రముఖులకు స్పూర్తిగా నిలుస్తూ నైతిక విలువలు, నిస్వార్ధ సేవతో ఆదర్శ జీవితాన్ని గడిపిన ఆర్ నల్లకన్ను ఇక లేరు. తమిళ ప్రజలందరూ అయ్యా అని పిలచుకొనే ఆయన బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొద్దికాలంగా వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న లెజెండరీ సీపీఐ నేత తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణ వార్తతో సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాయి. ఆయన మృతి నేపథ్యంలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటున్నారు. నల్లకన్ను జీవిత విశేషాలు, రజనీకాంత్, సూర్య, వెట్రీమారన్ తదితరుల సంతాపం సందేశాల వివరాల్లోకి వెళితే..
సీనియర్ సీపీఐ నేత నల్లకన్ను జీవిత విశేషాల వివరాల్లోకి వెళితే.. 1924 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన తిరువైకుంఠమం గ్రామంలో జన్మించారు. తన యుక్త వయసు నుంచే ఆయన వామపక్ష పార్టీలో కొనసాగారు. రైతులు, కార్మికుల కోసం ఎనలేని పోరాటాలు చేశారు. తన జీవిత కాలంలో నిస్వార్ధమైన రాజకీయ వేత్తగా రాణించారు. తాను మరణించే వరకు సొంత ఇల్లు, కారు లేకుండా తుది శ్వాస వరకు శేష జీవితాన్ని ప్రజల కోసమే తపించారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తన 101 ఏట ఫిబ్రవరి 25వ తేదీన కన్నుమూశారు.

అత్యంత సాధారణ జీవితం, నైతిక విలువలు, సిద్దాంతాలకు కట్టుబడి రాజకీయాలు నడిపిన నల్లకన్ను నిరంతరం ప్రజా పోరాటలకే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దాదాపు 8 దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. దళితులు, మైనారిటీలు, రైతులు, కార్మికుల సమస్యలపై తన గొంతుకను వినిపించారు. ఆయన పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా తన 80వ జన్మదినం సందర్భంగా 1 కోటి రూపాయలు, ఓ కొత్త కారును పార్టీ కార్యకర్తలు ఇచ్చారు. అయితే వాటిని స్వీకరించిన ఆయన వెంటనే.. ఇది కార్యకర్తల డబ్బు. కాబట్టి పార్టీకే చెందాలంటూ వెంటనే తిరిగి ఇచ్చేశారు.
నల్లకన్ను మరణించే వరకు అద్దె ఇంటిలోనే జీవించారు. చెక్క మంచం, రెండు జతల దుస్తులు, కొన్ని పుస్తకాలతో జీవితాన్ని గడిపారు. కనీసం సైకిల్ లేకుండా జీవితాన్ని ప్రజల కోసం అర్పించారు. తమిళనాడు అసెంబ్లీకి 1967లో, 1977 సంవత్సరంలో అంబ సముద్రం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందారు. 1999 సంవత్సరంలో కోయంబత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. రంజితం అనే స్కూల్ టీచర్‌ను వివాహం చేసుకొన్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. భార్య 2016 సంవత్సరంలో మరణించారు. ఇలాంటి ప్రభావిత జీవితం దేశం కోసం పాటుపడిన ఆయన మృతితో రజనీకాంత్, సూర్య, వెట్రీమారన్, మన్సూర్ ఆలీ ఖాన్, నాజర్, పార్థీబన్, వైరముత్తు, కార్తీ లాంటి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
లెజెండరీ నల్లకన్ను మరణించిన వార్త తెలియగానే రజనీకాంత్, సూర్య, వెట్రీమారన్ లాంటి ప్రముఖులు స్వయంగా వెళ్లి ఆయన పార్థీవ దేహానికి శ్రద్దాంజలి ఘటించారు. నల్లకన్ను భౌతికకాయం వద్ద కూర్చొని రజనీ మౌనంగా రోదించడం కనిపించింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లకన్ను నిస్వార్ధ సేవను, నైతిక విలువలను, సాధారణ జీవితం గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఓ దశలో కంటతడి పెట్టేంతగా భావోద్వేగానికి గురయ్యారు. రజనీకి, నల్లకన్నుకు అత్యంత స్నేహ బంధం ఉండేది. నల్లకన్ను సలహాలు, సూచనలు రజనీ పాటించే వారని చెప్పుకొంటారు. సూర్య, వెట్రీమారన్ తదితరులు పార్తీవ దేహానికి పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. ఆ తర్వాత దివంగత నేత ఇద్దరు కూతుళ్లను పరామర్శించారు.


Click it and Unblock the Notifications











