74 ఏళ్ల వయసులో రజనీకాంత్ మాస్ ఫీట్.. కూలీకి రికార్డ్ రెమ్యునరేషన్, ఎన్ని కోట్లంటే?
70 ప్లస్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ 2, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనూ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రజనీ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాల్లోకి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న కూలీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్, కార్తీ, కమల్ హాసన్‌లకు భారీ హిట్స్ ఇచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన లోకేష్.. ఏకంగా సూపర్‌స్టార్‌తో జత కట్టడమే అందుకు కారణం.
ఆగస్ట్ 14న కూలీ విడుదల
కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరి చూపు దాని మీదే పడింది. ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దాదాపు రూ.370 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్‌లు కీలకపాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూలీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాన్ థియేట్రికల్ రైట్స్‌తో రికార్డు
విడుదలకు ముందే కూలీ సినిమాకు రికార్డ్ లెవల్‌లో బిజినెస్ జరుగుతోంది. నాన్ థియేట్రికల్ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర లభిస్తోంది. కూలీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు దక్కించుకున్నట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక శాటిలైట్ రైట్స్ రూ.90 కోట్లు, ఆడియో రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంటే కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే రూ.240 కోట్లు వచ్చినట్లు. ఇక థియేట్రికల్ రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడవుతాయోనని కోలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది.
కూలీ కౌంట్‌డౌన్ స్టార్ట్
సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవలే సినిమా విడుదలకు సంబంధించి 100 రోజుల కౌంట్‌డౌన్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా కూలీ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే రజనీకాంత్ రెమ్యునరేషన్.
రజనీ పారితోషికం ఎంతంటే?
ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్‌ను మించి పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించిన రజనీకాంత్.. ఇప్పుడు 74 ఏళ్ల వయసులోనూ రెమ్యునరేషన్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్నారు. కూలీ చిత్రానికి తన రెమ్యునరేషన్‌ను తలైవా భారీగా పెంచేసినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. కోలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం రజనీ ఈ సినిమాకు రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. ఈ రేంజ్ రెమ్యునరేషన్‌తో రజనీకాంత్ బాలీవుడ్ స్టార్స్‌ను సైతం వణికిస్తున్నారు. దటీజ్ తలైవా.


Click it and Unblock the Notifications











