రజనీకాంత్ 'రాణా' లేటెస్ట్ ఇన్ఫో
ప్రముఖ దర్శకుడు కెఎస్.రవికుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాణా చిత్రానికి ఆది నుంచి ఒడిదొడుకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడినా రజినీకాంత్ రాణా చిత్రానికి బ్రేక్ వేసినట్టు కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ఏప్రిల్‌లో చెన్నై ఏవీఎం స్టూడియోలో రాణా షూటింగ్ ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో పాల్గొన్న రజనీకాంత్ హఠాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆయన రెండు నెలల పాటు సింగపూర్‌లో చికిత్స పొందిన విషయం విదితమే. అక్కడి నుంచి చెన్నై చేరుకున్న ఆయన, కుమార్తె ఐశ్వర్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
అక్టోబర్‌లో రాణా షూటింగ్ మళ్లీ ప్రారంభించనున్నట్టు చిత్ర దర్శకుడు కెఎస్ రవికుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ శుక్రవారం ఉదయం వెస్ట్‌మాంబళంలో కెఎస్.రవికుమార్ కార్యాలయానికి చేరుకున్నారు. రాణా గురించి రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం. రాణాకు తాత్కాలిక బ్రేక్ వేయడంపై ఈ చర్చలు కొనసాగినట్టు కోలీవుడ్‌లో వార్తలు షికారు చేస్తున్నారు. రజనీ మరో చిత్రంలో నటించనున్నారని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని ఈ వార్తల సారాంశం.


Click it and Unblock the Notifications











