వచ్చే నెలలో వస్తున్నా: రజనీకాంత్
''నా ఆరోగ్యం చాలా బావుంది..వచ్చే నెలలో నా షూటింగ్ పనులు మొదలవుతాయి. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నందువల్ల వచ్చే నెలలోనే సెట్స్‌లోకి అడుగుపెటుతున్నా''అని చెప్పారు రజనీకాంత్. చెన్నైలోని వాణీ మహల్ ఆడిటోరియంలో తన బంధువు, దీర్ఘకాల మిత్రుడు వై జి మహేంద్రన్ బృందం వారి 'నాడగం'అనే నాటకాన్ని తిలకించేందుకు భార్య లతతో కలసి వచ్చిన రజనీకాంత్ మీడియా తో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే నాటకం చాలా బాగుందంటూ వైజీ మహేంద్రన్ బృందానికి రజనీ అభినందనలు తెలుపారు. ఇక ఆయన తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో తెరకెక్కబోయే 'కొచ్చాడయాన్' చిత్రం కోసం రజనీ సన్నద్ధమవుతున్నారు.
రజనీకాంత్ తాజాగా'కొచ్చాడయాన్'అనే ఓ త్రీడీ చిత్రం కమిటైన సంగతి తెలిసిందే.తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్', 'ద అడ్వెంచర్ ఆఫ్ టిన్‌టిన్' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక 'రాణా'సినిమా రజనీకాంత్ చేయాలని ఆయన అనుకున్నా ఆరోగ్య సమస్యలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.


Click it and Unblock the Notifications











