చివరి కోరిక తీరకుండానే ఆర్బీ చౌదరీ.. సూపర్ స్టార్‌తో 100వ సినిమా చేయకుండానే..!
దక్షిణాదిలో దాదాపు 100 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ చౌదరీ ఇకలేరనే వార్త తెలుగు, తమిళ రంగాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడం సినీ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కుటుంబ నేపథ్యంగా నైతిక విలువలతో ఆయన రూపొందించిన చిత్రాలు అవార్డులు, రివార్డులు పొందాయి. ఉత్తమ అభిరుచి ఉన్న నిర్మాతగా గుర్తింపు పొందిన ఆర్బీ చౌదరీ అర్ధాంతరంగా తన జీవితం నుంచి నిష్క్రమించడం ఆయన స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, సినీ వర్గాలను తీవ్రంగా బాధిస్తున్నది. అయితే నిర్మాతగా తన కెరీర్‌లో చివరి కోరిక తీరకుండానే ఈ లోకం నుంచి వెళ్లిపోవడాన్ని ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చివరి కోరిక ఏమిటనే వివరాల్లోకి వెళితే..
ఆర్బీ చౌదరీ నిర్మాతగా మలయాళంలో ఆడిపాపం అనే సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా వెనక్కి చూసుకోలేదు. తెలుగులో 1994 సంవత్సరంలో తొలిసారి కెప్టెన్ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సుస్వాగతం, సూర్యవంశం, నేను ప్రేమిస్తున్నాను, రాజా, శ్రీను, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ప్రియమైన నీకు, సింహరాశి, స్నేహమంటే ఇదేరా, సంక్రాంతి, అన్నవరం, నవ వసంతం, గోరింటాకు, భీమిలి కబాడ్డీ జట్టు తదితర చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగులో ఆయన నిర్మించిన చివరి చిత్రాలు చిరంజీవితో గాడ్ ఫాదర్, చెప్పాలని ఉంది, భవనం ఉన్నాయి.

దళపతి విజయ్‌తో ఆర్బీ చౌదరీ పలు చిత్రాలను నిర్మించారు. విజయ్ కెరీర్ ఆరంభంలో పూవే ఉనక్కాగ, లవ్ టుడే, తుళ్లాత మనముమ్ తుళ్లుమ్, షాజహాన్, తిరుపాచ్చి, జిల్లా చిత్రాలను నిర్మించారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం, ఇతర భాషల్లో కలిపి మొత్తం 98 చిత్రాలను పూర్తి చేశారు. ప్రస్తుతం విశాల్‌తో 99వ చిత్రాన్ని మకుటం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మకుటం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఆర్బీ చౌదరీ మరణవార్త తెలుసుకొని చిత్ర యూనిట్ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన ఆకస్మిక మృతికి చింతిస్తూ శ్రద్దాంజలి ఘటిస్తూ సంతాపం తెలిపారు.
అయితే తన సినీ ప్రయాణంలో 100 చిత్రాన్ని ఘనంగా నిర్మించాలని ఆర్బీ చౌదరీ కల కన్నారు. తన కెరీర్‌లో నభూతో నభవిష్యత్ అనే విధంగా భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. తన 100వ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నిర్మించాలనే కోరికతో ప్రయాణించారు. అయితే విధి వశాత్తు ప్రమాదానికి గురై తన కోరిక తీరకుండానే పరలోకానికి వెళ్లారు. ఆయన తన జీవితంలో రజనీకాంత్‌తో సినిమా తీయాలనే కోరిక మాత్రం తీరని కలగానే మిగిలిపోయింది అని ఆయన సన్నిహితులు ఈ సందర్భంగా వెల్లడిస్తున్నారు.
నిర్మాత ఆర్బీ చౌదరీ తన వ్యక్తిగత పనులపై రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. జైపూర్ నుంచి ఉదయ్‌పూర్ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆయన పార్థీవ దేహాన్ని జైపూర్ నుంచి చైన్నైకి తరలించారు. బుధవారం రోజున ఆయన అంత్య్రక్రియలను నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆర్బీ చౌదరీ ఫ్యామిలీ వివరాల్లోకి వెళితే.. తమిళ కుటుంబానికి చెందిన మహజాబీన్‌ను ఆర్బీ చౌదరీ వివాహం చేసుకొన్నారు. ఆయనకు నలుగురు కుమారులు. జీవన్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. జీతన్ రమేష్, జీవా సినిమా ఇండస్ట్రీలో నటులుగా సుపరితులు. రంగం సినిమా ద్వారా జీవా పాపులారిటీని సంపాదించుకొన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications