పూరీతో రాంగోపాల్ వర్మ చేసే చిత్రం కథ
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ నిర్మించే చిత్రం 'ద బిజినెస్‌మ్యాన్'. తమిళ హీరో సూర్యతో మూడు భాషలు..(తెలుగు, తమిళం, హిందీలో) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్ర కథ గురించి రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ...ఇందులో బిజినెస్‌మ్యాన్ చేసే బిజినెస్ ఏంటో తెలుసా.. నేరాలు! 2010 నాటికి భారతదేశంలో మాఫియా గ్యాంగుల కార్యకలాపాలు దాదాపు లేకుండాపోయాయి. దీనికి కారణం..దావూద్ ఇబ్రహీం ముఠా పాకిస్తాన్‌కి వెళ్లిపోవడం, చోటా షకీల్ పూర్తిగా నిస్తేజంగా మారడం, చోటా రాజన్ వివిధ ప్రభుత్వ సంస్థలకు సహకరిస్తుండటం, అరుణ్ గోవిల్ రాజకీయాల్లోకి రావడం, అబూ సలేమ్ జైలుపాలు కావడం. అండర్ వరల్డ్ కార్యకలాపాలను అరికట్టడంలో విజయం సాధించిన ముంబై పోలీసులు తమ ఎన్ కౌంటర్ స్క్వాడ్ బృందాల్ని సైతం తొలగించేశాయి.
ఈ విషయాలనన్నింటినీ దక్షిణాదికి చెందిన ఒక వ్యాపారి జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చాడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యాపారుల మాదిరిగానే ముంబైకి వచ్చిన అతను వారిలాగా కాకుండా 'నేరాల్ని' వ్యాపారంగా ఎంచుకున్నాడు. సులువైన మార్గాల్లో ఎలా సంపాదించాలో తెలుసుకోవడంతో పాటు ముంబైని ఏలిన హాజీ మస్తాన్, వర్ధా భాయ్, కరీం లాలా, దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ వంటి మాఫియా లీడర్లు సాధించిన విజయాలను సునిశితంగా అధ్యయనం చేసిన అతను ముంబైలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌గా మారాలనుకుంటాడు. తప్పొప్పులపై, మంచి చెడులపై అతనికి నమ్మకాలు లేవు. ఒప్పందాలతోటే ఈ ప్రపంచంలోని అందరూ బతుకుతుంటారని అతను నమ్ముతాడు. ఆ ఒప్పందం భార్యాభర్తల మధ్య కావచ్చు; తల్లిదండ్రులు, పిల్లల మధ్య కావచ్చు; రాజకీయ నాయకులు, ఓటర్ల మధ్య కావచ్చు; బాబాలు, భక్తుల మధ్య కావచ్చు.
నేరం కూడా ఇతర వ్యాపారం లాంటిదేనని అతను భావిస్తాడు. అలాంటి గ్యాంగ్‌స్టర్ కథే 'ద బిజినెస్‌మ్యాస్'. నేను తీసిన 'కంపెనీ'లోని గ్యాంగ్‌స్టర్ల మధ్య పోరాటాలు, పూరి రూపొందించిన 'పోకిరి'లోని వినోదం..రెండూ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా 2011 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది..అని వివరించారు. ప్రస్తుతం సూర్య రామ్ గోపాల్ వర్మ రక్త చిరిత్ర చిత్రంలో మద్దెల చెరువు సూరి పాత్రని చేస్తున్నారు. అలాగే మురగదాస్ కాంబినేషన్లో మరో చిత్రం కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











