విజయ్ పార్టీలోకి ఆర్కే రోజా? క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి

TVK Vijay - Roja Selvamani: తమిళనాడు రాజకీయాల్లో చరిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ దళపతి విజయ్.. తమిళగ వెట్రి కళగం పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. ఇప్పుడు రాష్ట్ర పాలన బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

గవర్నర్ R. N.రవి దళపతి విజయ్‌తో ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు కూడా పదవీ ప్రమాణం చేశారు. తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందంటూ టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి టీవీకే పార్టీలో మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా (Roja Selvamani) చేరుతున్నారనే ప్రచారంపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

Roja Selvamani Clarifies on Joining TVK Party After Vijay Becomes Tamil Nadu CM

మాజీ మంత్రి రోజా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ భవిష్యత్తు, తమిళ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారనే ప్రచారం, అలాగే విజయ్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో "రోజా ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌బై చెప్పి చెన్నైలో సెటిల్ అవుతున్నారు", "విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగంలో జాయిన్ అవబోతున్నారు" అనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజాను యాంకర్ ఇదే విషయంపై ప్రశ్నించారు. "మీరు చెన్నైలో సెటిల్ అయిపోయారు.. విజయ్ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది.. దీనిపై మీ స్పందన ఏంటి?" అని అడగగా.. రోజా నవ్వుతూ స్పందించారు. "రాజకీయంగా నా ఎదుగుదలను తట్టుకోలేని వాళ్లే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. నన్ను ఓడించామని అనుకున్న వాళ్లు.. అధికారంలో లేకున్నా ప్రజల్లో నాకు ఉన్న అభిమానాన్ని చూసి ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇలాంటి రూమర్లు సృష్టిస్తున్నారు" అంటూ కౌంటర్ ఇచ్చారు.

అంతేకాదు, తాను ఆంధ్రప్రదేశ్‌ను వదిలి తమిళనాడుకు వెళ్లే ఆలోచన అసలు లేదని స్పష్టం చేశారు. "నేను ఎందుకు ఆంధ్రాను వదిలి వెళ్తాను? నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఈ నేలతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. గతంలో తమిళనాడు రాజకీయాల్లోకి రావాలని పలువురు ప్రముఖులు ఆహ్వానించారని కూడా రోజా వెల్లడించారు.

ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి జయ లలిత తనను తమిళ రాజకీయాల్లోకి రావాలని కోరిన విషయాన్ని రోజా గుర్తుచేసుకున్నారు. "జయలలిత గారు కూడా తమిళనాడులో పోటీ చేయమన్నారు. ఆ సమయంలో నేను నో చెప్పాను. మరో కొన్ని పార్టీల వాళ్లు కూడా ప్రచార ఖర్చులు మొత్తం మేమే చూసుకుంటామని చెప్పారు. అయినా నేను తిరస్కరించాను" అంటూ చెప్పారు.

తాను రాజకీయాల్లోకి వచ్చిన కారణం పదవులు కాదని.. ప్రజలకు సేవ చేయాలనే కోరికేనని వివరించారు. "నాకు నా ఊరు, నా ప్రజలంటే పిచ్చి. ఈ స్థాయికి రావడానికి నన్ను ప్రేమించిన ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని అనిపించింది" అని రోజా తెలిపారు. తాను ఇతర సినీ సెలబ్రిటీలలా ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టుల కోసం రాజకీయాల్లోకి రాలేదని కూడా స్పష్టం చేశారు.

గతంలో తెలుగు దేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చినా.. తాను తిరస్కరించానని రోజా వెల్లడించారు. "నాకు ఎమ్మెల్సీగా ఉండటం ఇష్టం లేదు. ఎమ్మెల్యేగా ప్రజల మధ్య ఉండాలని కోరుకున్నాను" అంటూ చెప్పారు. ప్రజలతో నేరుగా మమేకమవ్వడమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. ఇక మరోసారి యాంకర్ "విజయ్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా?" అని అడగగా.. రోజా క్లారిటీ ఇచ్చారు. "అందులో ఎలాంటి నిజం లేదు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదు" అని తేల్చిచెప్పారు. అయితే విజయ్ కుటుంబంతో తనకు మంచి పరిచయం ఉందని తెలిపారు.

"విజయ్ వాళ్ల నాన్న ఎస్.ఏ. చంద్రశేఖర్ నాకు పెద్ద ఫ్యాన్. కావాలనే నాతో ఒక పాటలో డాన్స్ చేయించారు. ఆ సమయంలో విజయ్ కమింగ్ స్టార్‌గా ఉన్నారు" అంటూ సినీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తమిళనాడులో విజయ్‌కు అపారమైన ప్రజాదరణ ఉందని కూడా రోజా అంగీకరించారు. "నా కొడుకు కూడా విజయ్‌కు పెద్ద ఫ్యాన్" అంటూ నవ్వుతూ చెప్పారు.

ప్రస్తుతం రోజా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ పార్టీ చేరికపై వస్తున్న ప్రచారానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తమిళ రాజకీయాల్లో తనకు వచ్చిన ఆఫర్లను తిరస్కరించి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

Read more about: vijay roja selvamani tamil nadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X