Virupaksha: అక్కడ కూడా విరూపాక్ష విడుదల.. భారీగా థియేటర్లు.. ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే?
మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమా నుంచి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టి సుప్రీమ్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అనేక చిత్రాల్లో నటించి సాయి ధరమ్ తేజ్ కు హిట్ అందించిన చిత్రాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అయినా ఎప్పటికప్పుడు తనను మార్చుకుంటూ సరికొత్త పంథాలో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అలా చేసిన చిత్రమే విరూపాక్ష. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాను మరో భాషలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
డిఫరెంట్ సినిమాలు : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అనంతరం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఎక్కువగా ఫ్లాప్స్ నే చవిచూశాడు. అయినా డిఫరెంట్ వేలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.

మంచి సక్సెస్ : ఇక తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం విరూపాక్ష. అతని కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో మలయాళ బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా, సోనియా సింగ్ ఫీమెల్ లీడ్ రోల్ చేసింది. సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించిన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న శుక్రవారం విడుదలై మంచి సక్సెస్ కొట్టింది.

భారీ సంఖ్యలో : విరూపాక్ష సినిమాకు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 45.40 కోట్ల గ్రాస్, రూ. 26.23 కోట్లు రాబట్టింది. అంతేకాకుండా అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా ఎంట్రీ అయింది. దీంతో ఈ సినిమాను మరో భాషలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విరూపాక్ష తమిళ వెర్షన్ మే 5న రిలీజ్ కానుంది. తమిళనాడు అంతటా భారీ సంఖ్యలో విడుదల చేస్తున్నారు.
ఇతర భాషల్లో : ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ కేఈ జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ విరూపాక్ష చిత్రాన్ని పెద్ద ఎత్తున గ్రాండ్ గా విడుదల చేస్తుంది. తమిళనాడు వ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లను విరూపాక్ష కోసం కేటాయిస్తున్నారు. ఇదే కాకుండా ఇతర భాషలో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సీక్వెల్ ప్లాన్ : సో ఇలా ఇతర రాష్ట్రాల్లో కూడా విరూపాక్ష సత్తా చాటే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ కార్తీక్ దండు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సుకుమార్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ తర్వాత ఉండొచ్చని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











