ఆత్మహత్యాయత్నం వార్తలపై దర్శకుడు సముద్రఖని స్పందన!
చెన్నై: తమిళ దర్శకుడు సముద్రఖని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్లు ఇటీవల తమిళ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. సముద్రఖని ఆత్మహత్య విషయం మీడియాలో చర్చనీయాంశం కావడంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. తన గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారంలోకి రావడంతో ఖంగుతిన్న సముద్రఖని మీడియా ముందుకు వచ్చి స్పందించారు.
తాను ఎలాంటి ఆత్మహత్య యత్నానికి పాల్పడలేదని, తన గురించి వస్తున్న అలాంటి వార్తలు నమ్మ వద్దని చెప్పుకొచ్చారు. ఓ సినిమా స్క్రిప్టు డిస్కర్షన్లో భాగంగానే తాను సిటీ వదిలి బయటి ప్రాంతానికి వెళ్లానని, అంతకు మించి మరేమీ లేదని సముద్ర ఖని చెప్పుకొచ్చారు.
ఇంతకీ సముద్రఖని ఆత్మహత్య వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణం....'నిమిర్థ్ను నిల్' తమిళ సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడమే అంటున్నారు. ఈ చిత్రం ఆర్థిక సమస్యలతో విడుదల ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
సముద్రఖని తెలుగు సినిమాల విషయానికొస్తే.....గతంలో తెలుగులో 'శంభో శివ శంభో', 'సంఘర్షణ' చిత్రాలు తెరకెక్కించిన సముద్రఖని తాజాగా నాని హీరోగా 'జెండాపై కపిరాజు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications












