కట్టప్ప ఫ్యామిలీ ఫాంహౌస్‌పై ఏనుగుల దాడి.. అసలేం జరిగిందంటే!
సాధారణంగా ప్రకృతి గానీ, జంతువులకు గానీ కోపం తెప్పించే పని చేస్తే అవి చేసే విలయతాండవాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. తమ ఇష్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని శిక్షించిన సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటి సంఘటనే బాహుబలిలో కట్టప్ప, ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబానికి ఎదురైంది. ఆ వివరాల్లోకి వెళితే..

కోయంబత్తూరు జిల్లాలో
ప్రముఖ నటుడు సత్యరాజ్ సోదరికి కోయంబత్తూరు జిల్లాలోని నీలగిరి పర్వత శ్రేణుల్లోని పెరియనాయక్కన్‌పాలయ్ అనే గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఫాంహౌస్ ఉంది. ఆ ఇంటిని ఏనుగుల మంద భీకరంగా దాడి చేశాయని ఫాంహౌస్ సిబ్బంది వెల్లడించారు. ఇంటిని చుట్టుముట్టిన 15 ఏనుగులు బీభత్సం సృషించాయి అని తెలిపారు.

ఏనుగుల గుంపు రాగానే
ఒక్కసారిగా ఏనుగుల గుంపు ఇంటిపైకి దాడికి రావడంతో భయంతో ఇంటి టెర్రస్‌పైకి ఎక్కాం. మేము ఉన్నామనే విషయం తెలియకుండా ఓ మూలకు నక్కి దాక్కున్నాం. చప్పుడు చేయకుండా అక్కడే ఉన్నాం. ఏనుగులు చేసిన హంగామాను చూస్తూ భయంతో అక్కడే ఉన్నాం అని సిబ్బంది తెలిపారు.

దాహం తీర్చుకోవడానికి వచ్చాయంటూ
అయితే కాసేపటికి ఏనుగులు చేస్తున్న హంగామా కోపంతో కాదని అర్ధమైంది. అవి ఆనందంగా ఆడుతూ గెంతులేసాయనే విషయాన్ని ఆలస్యంగా గమనించాం. ఇంటి వద్ద ఉన్న నీళ్లతొట్టి వద్దకు వెళ్లి దాహం తీర్చుకొన్నాయి. అక్కడే కాసేపు ఆడుతూ ఆనందంగా కనిపించాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆవి కాసేపటి తర్వాత వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకొన్నాం అని తెలిపారు.

ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే
ఏనుగుల గుంపు చేసిన ఘటనపై సత్యరాజ్ కుటుంబ సభ్యులు స్పందించలేదు. కానీ ఆ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయనే విషయాన్ని స్థానికులు చెబుతున్నారు.
Recommended Video

బాహుబలి చిత్రంతో
బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా ఆదరణను సంపాదించుకొన్న సత్యరాజ్ ఇటీవల కాలంలో జెర్సీ, ప్రతీ రోజు పండగే లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం ఎంజీఆర్ మగన్, మాడై తిరుంతు, పార్టీ, తీరుపుగల్ విక్రపాడమ్, ఖాకీ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











