సూర్య వెరైటీనెస్ 'సెవెంత్ సెన్స్'..!
'గజిని" చిత్రంతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరించిన దర్శకుడు ఎఆర్ మురుగదాస్, సూర్యల కాంబినేషన్లో మరో భారీ చిత్రం రాబోతుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తమిళ్‌లో '7ఆమ్ ఆరివు" అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. సూర్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రం దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. అమీర్‌ఖాన్‌తో రూపొందించిన 'గజిని" చిత్రం తర్వాత బాలీవుడ్‌లో బారీ ఆఫర్లు వచ్చినా వాటిని పక్కన పెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో మురుగదాస్ ఈ చిత్రాన్ని 'సూపర్ మిషన్" బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడట. కాగా 'గజిని" చిత్రంలో షార్ట్ టర్మ్ మెమోరీలాస్ పేషెంట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న సూర్య ఈ చిత్రంలో సైంటిస్ట్ గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసిగా సూర్య నటించిన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని, ఈ పాత్ర నిడివి ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుందని కోలీవుడ్ సమాచారం.
అలాగే సర్కస్ కళాకారుడిగా నటించిన సూర్య ఈ పాత్ర కోసం వియాత్నాంలో కుంగ్‌ఫూకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించాడట. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ' సెవెంత్ సెన్స్" అనే పేరుని పరిశీలిస్తున్నారని, ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై బి. సుబ్రహ్మణ్యం తెలుగులో అందించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుందట.


Click it and Unblock the Notifications











