రెండోసారి సీఎంగా ఆయనైతేనే బావుంటుంది.. స్టార్ హీరో ఫ్యాన్స్‌కు పండగే!
దిగ్గజ దర్శకుడు ఇప్పట్లో కొత్త సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు లేదు. వరుసగా సీక్వెల్స్ బాట పట్టారు. రోబో చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించిన 2.0 చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం శంకర్ 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు. కమల్ హాసన్ నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. భారతీయుడు 2లో కమల్ హాసన్ సేనాపతి పాత్రలోనటించనున్నారు. ఇదిలా ఉండగా శంకర్ మరో సీక్వెల్ గురించి తన మనసులో మాట చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒకే ఒక్కడు సీక్వెల్
దాదాపు 19 ఏళ్ల క్రితం శంకర్, అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్కడు చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. శంకర్ నుంచి వచ్చిన అద్భుతమైన సందేశాత్మక చిత్రాల్లో ఒకే ఒక్కడు ఒకటి. ఈ చిత్రంలో అర్జున్ ఒక్కరోజు సీఎంగా అద్భుతమైన నటన కనబరిచారు. ఈ చిత్రానికి కూడా శంకర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెండోసారి సీఎం ఎవరు
ఒకవేళ ఈ చిత్రాన్ని సీక్వెల్ రూపొందిస్తే సీఎం పాత్రలో ఎవరు నటిస్తారనే ప్రశ్నకు శంకర్ తన మనసులో మాట బయట పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో శంకర్ ఒకే ఒక్కడు చిత్ర సీక్వెల్ గురించి వివరించారు. ఈ చిత్రాన్ని కూడా రజని కాంత్, కమల్ ఎవరు ఒప్పుకున్నా వారితో చేస్తానని శంకర్ తెలిపాడు. కానీ కథ యువ హీరోని డిమాండ్ చేస్తే నా ఛాయిస్ మాత్రం విజయ్ అని శంకర్ తెలిపాడు. విజయ్ ఇప్పటికే వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు.

అభిమానులకు పండగే
శంకర్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన స్నేహితుడు చిత్రం నిరాశపరిచింది. దీనితో వీరిద్దరి కాంబినేషన్లో విజయ్ అభిమానులు ఓ పవర్ ఫుల్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా శంకర్ చేసిన వ్యాఖ్యలు విజయ్ ఫాన్స్ కు జోష్ ని పెంచేవి అని చెప్పొచ్చు. భారతీయుడు 2 చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఒకే ఒక్కడు సీక్వెల్ గురించి ఆలోచిస్తానని శంకర్ తెలిపారు.

సరైన విజయం కోసం
శంకర్ దిగ్గజ దర్శకుడు అని చెప్పడంలో సందేహం లేదు. కానీ గత రెండు చిత్రాలని పరిశీలిస్తే శంకర్ స్థాయికి తగ్గ విజయం దక్కలేదు అని చెప్పొచ్చు. ఐ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఇక 2.0 చిత్రం విజువల్స్ అబ్బురపరిచినా పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేక పోయింది. దీనితో భారతీయుడు 2 పై శంకర్ దృష్టి పెట్టారు.


Click it and Unblock the Notifications











