హాస్య నటుడి ప్రేమ వివాహం...సూపర్ స్టార్ కనెక్షన్
చెన్నై : ప్రముఖ తమిళ హాస్య నటుడు శివ వివాహం గురువారం ఉదయం చెన్నైలో వైభవంగా జరిగింది. సుడిగాడు ఒరిజనల్ 'తమిళ్‌పడం' హీరోగా శివ బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇంజినీరింగ్ పట్టభద్రురాలైన ప్రియను ఐదేళ్లుగా ప్రేమిస్తున్నట్లు శివ ఇటీవలే బయటపెట్టాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి వివాహం గురువారం ఉదయం 10.30కు ఎగ్మూరులోని రాణి మెయ్యమ్మై కల్యాణమంటపంలో వేడుకగా జరిగింది.
ఇక సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కీ, ఈ వివాహానికీ కనెక్షన్ ఏమిటంటే రజనీ..'తిల్లుముల్లు' చిత్రం చేస్తున్నప్పుడే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శివ... రజనీకాంత్ సూపర్ హిట్ 'తిల్లుముల్లు' రీమేక్ లోచేస్తున్నాడు. అలా అదే చిత్రం షూటింగ్ లో ఉండగానే చిత్రం హీరోలకు మ్యారేజీ కావటం విశేషం అనేది కోలీవుడ్ లో హాట్ టాపిక్.
'చెన్నై-28' చిత్రంతో యూత్ ను ఆకట్టుకున్న నటుడు శివ. 'తమిళ్‌పడం', 'వా', 'కలగలప్పు' ద్వారా ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 'తిల్లుముల్లు' రీమేక్, సొన్నా పురియాదు, తిల్లుముల్లు, శివ పూజైయిల్ కరడి, కేడి బిల్లా కిలాడి రంగా లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పెళ్లి కూతరు ప్రియ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె, శివ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతోనే శివ, ప్రియల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వివాహానికి అజిత్ తన భార్య శాలిని, కుమార్తెతో పాటు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు. విమల్, సిబిరాజ్, భాగ్యరాజ్, దర్శకుడు సుందర్ సి, కుష్బూ దంపతులు, వసంతకుమార్, గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, నిర్మాత టి.శివ, దర్శకుడు బద్రి, ప్రియ, నటి కస్తూరి పెళ్లికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి జయలలిత శివ, ప్రియ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖతో పాటు పెళ్లికానుకను పంపించారు.


Click it and Unblock the Notifications











