‘కాంజీవరం' శ్రియా రెడ్డి హర్షం
తమిళ 'కాంచీవరం' చిత్రంలో నటనకు గాను ప్రకాష్ రాజ్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం పట్ల ఆ చిత్రంలో ప్రకాష్ రాజ్ కు జోడిగా నటించిన శ్రియారెడ్డి ఆనందం వ్యక్తం చేసింది. నటిగా పలు చిత్రాల్లో నటించి మంచిపేరు తెచ్చుకున్న శ్రియారెడ్డి నిర్మాత విక్రమ్ కృష్ణను (హీరో విశాల్ సోదరుడు) కొద్దికాలం క్రితం పెళ్లి చేసుకున్నారు.
ఒక సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని 'కాంజీవరం' చిత్రాన్ని దర్శకుడు ప్రియదర్శన్ తీర్చిదిద్దారనీ, రొటీన్ చిత్రాలకు ఇది భిన్నమైన చిత్రమనీ ఆమె తెలిపారు. స్వాతంత్ర్యం రావడానికి పూర్వం 'కాంజీవరం'లో జరిగిన రియల్ స్టోరీ ఇదనీ, దీన్ని సహజత్వానికి అతి దగ్గరగా దర్శకుడు తెరకెక్కించారనీ ప్రశంసించారు. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒక మంచి సినిమాలో నటిస్తున్నాననే భావన తనకు కలిగిందన్నారు. ప్రకాష్ రాజ్ నటనకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందనీ, ఆయనకు తన హార్దిక శుభాకాంక్షలనీ అన్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 'కాంజీవరం' ను తీర్చిదిద్దిన దర్శకుడు ప్రియదర్శన్ కు సైతం తన అభినందలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











