Simbu's Saamrajyam Promo Review: సామ్రాజ్యం ప్రోమో రివ్యూ.. శింబు కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడంటే?
సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య సన్నిహిత బంధాలు ఉండటం మనం చూస్తుంటాం. ఒకరి సినిమా కోసం మరోకరు వచ్చి సహకారం అందిస్తుంటారు. సినిమా టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ చేసి ఆ మూవీకి బజ్ క్రియేట్ చేస్తారు. అంతేకంటే వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తమ ఫ్యాన్స్‌కు తెలియచేస్తారు. ఆ కోవలోనే తనకు ఇష్టమైన హీరో శింబు కోసం ఎన్టీఆర్ తన వంతు సహకారం అందించారు. శింబు నటిస్తున్న టీజర్‌ను రిలీజ్ చేసి తనతో ఉన్న రిలేషన్‌ను చాటి చెప్పారు. శింబు నటిస్తున్న సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను తాజాగా శింబు హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో ఇప్పటికే అరసన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ సినిమా కోసం సామ్రాజ్యం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ టీజర్‌ను జూనియర్ ఎన్టీఆర్ తన చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

ఇక సామ్రాజ్యం సినిమా ప్రోమో విషయానికి వస్తే.. కోర్టు బయట తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు ఓ వ్యక్తి కథ చెబుతున్న దృశ్యంతో ప్రోమో మొదలవ్వడం కనిపిస్తుంది. సార్... నేను చెప్పబోయే మ్యాటర్ మొత్తం రియాలిటీ. నరికినోళ్లు, చచ్చినోళ్ళు, స్థలం, పేరు, టైం, ఊరు... మొత్తం రియాలిటీనే. కానీ మీరు అలా చూపించకండి. ఈ సినిమాలో వచ్చేదంతా ఉట్టి భూటకం అని కార్డు వేస్తారు కదా! అలా వేయండి' అని శింబు చెబుతుంటారు. ఆ పాత్రలో ఎన్టీఆర్ అయితే అదరగొడతారని చెబుతారు.
ఆ తర్వాత కోర్టులో వాయిదాకు సమయం కావడంతో వెళతారు. ముగ్గురు మనుషుల్ని అత్యంత కిరాతకంగా నరికి చంపిన కేసులో ఆయన ముద్దాయి. అయితే తాను ఎవరినీ చంపలేదని, తనపై అన్యాయంగా కేసు బనాయించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేస్తారు శింబు. ప్రోమోలో రెండు భిన్నమైన గెటప్పుల్లో ఆయన కనిపించారు. కోర్టు సన్నివేశాల్లో కాస్త నెరిసిన గడ్డంతో, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో యువకుడిగా ఉన్నారు. ఆ కేసు ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. వడ చెన్నై ప్రపంచంలో ఎవరికీ చెప్పని కథ అంటూ ప్రోమో చివర్లో వేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. శింబు కెరీర్‌లో ది బెస్ట్ రావాల్సి ఉంది. ఆయనలోని ప్రతిభను ఇంకా చూడాల్సింది చాలా ఉంది. వెట్రిమారన్ కంటే ఇంకెవరు ఆయనను బాగా చూపిస్తారు. సాధారణంగా టీజర్ రెండు, మూడు నిమిషాలు నిడివితో ఉంటాయి. కానీ సామ్రాజ్యం మూవీ టీజర్ ఐదున్నర నిమిషాలు నిడివితో ఉండటాన్ని చూస్తే సినిమాలో ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో చూడాల్సిందే అని అన్నారు.
సామ్రాజ్యం సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు వేల్ రాజ్ సినిమాటోగ్రఫిని, కే రామర్ ఎడిటింగ్, జాకీ ఆర్ట్ డైరెక్టర్‌గా, పీటర్ హెయిన్స్ స్టంట్ డైరెక్షన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు 'వి క్రియేషన్స్' అధినేత కలైపులి ఎస్ థాను. ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











