సూపర్ స్టార్ రజనీకాంత్, శ్రియా హీరోహీరోయిన్లుగా శంకర్ రూపొందించిన శివాజీ చిత్రం ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇంకా సృష్టిస్తోంది. సిల్వర్ జూబ్లీని కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూపొందిన విధానంపై తాజాగా ఒక పుస్తకం వచ్చింది. ప్రముఖ తమిళ జర్నలిస్టు రాణిమైంథన్ శివాజీ-చింతనాయ్ ముథల్ సెల్యూలాయిడ్ వరాయ్ పేరిట పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ కిఝక్కు పత్తిప్పాగమ్ ప్రచురించింది. ఈ పుస్తకంలో సినీ నిర్మాణానికి సంబంధించిన ఎన్నో తెలియని విషయాలను పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని శివాజీ సినిమా హీరో రజనీకాంత్ చేతే విడుదల చేయించడానికి ప్రచురణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బద్రి శేషాద్రి చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ పుస్తకాన్ని విడుదల చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు రజనీకాంత్ అన్నారు. పుస్తక విడుదల కార్యక్రమం కోసం సమయాన్ని కూడా కేటాయించారు. అదే రోజు(జనవరి 3)న రాఘవేంద్ర మండపానికి ప్రచురణ కర్తలను రమ్మని చెప్పి సాదా సీదాగా పుస్తకాన్ని విడుదల చేశారు. ఇలాంటి పుస్తకాలు మరే చిత్రంపై రాలేదని ఈ సందర్భంగా రచయిత కృషిని శివాజీ ప్రశంసించారు. ఈ సినిమాకు ఇంతటి గౌరవాన్ని కల్పించినందుకు రజనీకాంత్ రచయితకు ధన్యవాదాలు కూడా చెప్పారు. కాగా జర్నలిస్ట్ రాణి మైంథన్ పుస్తకం రాయడానికి ముందు చిత్ర నిర్మాత ఎవిఎమ్ శరవణన్, దర్శకుడు శంకర్, హీరో రజనీకాంత్ లతో మాట్లాడారు. పుస్తకంలో విలువైన సమాచారాన్ని పొందుపరచగలిగారు.