గ్యారేజీలో జీవితం మొదలు పెట్టాడు: మోహన్ బాబుపై సూర్య ట్వీట్
సూర్య హీరోగా 'సూరారై పొట్రు' అనే కొత్త సినిమా మొదలైంది. మాధవన్‌తో 'సాలా ఖాదూస్', వెంకటేష్‌తో 'గురు' లాంటి బాక్సింగ్ నేపథ్యం ఉన్న చిత్రాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తెలుగు నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల చెన్నైలో షూటింగ్ మొదలవ్వగా... మోహన్ బాబు కూడా జాయిన్ అయ్యారు. 'ఎయిర్ డెక్కన్' అనే విమానయాన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మోహన్ బాబుతో కలిసి పని చేయడంపై సూర్య ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిన్న గ్యారేజీలో మొదలై ఈ స్థాయికి...
‘మోహన్ బాబు సర్‌తో కలిసి సెట్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన గొప్ప క్రమశిక్షణ కలిగిన మనిషి, జీవితంలో అన్నీ ఫుల్ ఫిల్ చేసుకున్న లెజెండ్. ఓ చిన్న గ్యారేజీలో ఉంటూ తన కెరీర్ మొదలు పెట్టి 500కుపైగా సినిమాల్లో నటించి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన ఎంతో మందికి స్పూర్తి. అలాంటి వ్యక్తితో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. ‘సూరారై పొట్రు'లో ఆయన భాగం అయినందుకు ధన్యవాదాలు' అని సూర్య ట్వీట్ చేశారు.

సూర్య టాప్ స్టార్ అయినప్పటికీ సెట్ లో క్రమశిక్షణతో..
సూర్య ట్వీట్ మీద మోహన్ బాబు స్పందించారు. ‘నా గురించి ఇంత గొప్పగా భావిస్తున్నందుకు థాంక్స్. ఈ జనరేషన్‌లో టాప్ స్టార్ అయినప్పటికీ సూర్య సెట్ లో క్రమశిక్షణతో, హుందాగా ఉంటారు. మీ ప్రవర్తనే మీ క్యారెక్టర్ గురించి చెబుతుంది. తర్వాతి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాను మై యంగ్ ఫ్రెండ్' అంటూ రిప్లై ఇచ్చారు.

2020లో రాబోతున్న ‘సూరారై పొట్రు’
‘సూరారై పొట్రు' చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వం వహిస్తుండగా సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సూర్యతో పాటు అపర్ణ బాలమురళి, జాకీ ష్రాఫ్, మోహన్ బాబు, కరుణాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సూర్య ‘కాప్పన్’
సూర్య సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన ‘ఎన్టీకె' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. సూర్య నటించిన మరో చిత్రం ‘కాప్పన్' ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మోహన్ లాల్, ఆర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











