రజనీతో రాజమౌళీ చిత్రం?
'మగధీర" చిత్రంతో 'తెలుగు శంకర్"గా కొనియాడబడుతున్న యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు రజనీకాంత్ ఆసక్తి చూపుతున్నారని కోలివుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'రోబో" (తమిళంలో 'యంత్ర") చిత్రంలో నటిస్తున్న రజనీ, ఆ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశముందని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'మగధీర" చిత్రం సంచలన విజయం సాధిస్తుండడం, పలు భాషలకు చెందిన దర్శకులు, కథానాయకులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తుండడంతో దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగిపోతున్నది.
కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమైన చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీయగలిగిన రాజమౌళికి- తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతోపాటు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగిన రజనీతో.. బడ్జెట్ పరిమితులు లేకుండా సినిమా తీసే అవకాశం వస్తే, ఇక ఆ చిత్రం ఏవిధంగా రూపుదిద్దుకుంటుందో ఊహించడం కూడా సాధ్యం కాదంటూ అప్పడే చర్చలు కూడా మొదలుకావడం విశేషం!


Click it and Unblock the Notifications











