జీవా 'మాస్క్' చిత్రం స్టోరీ లైన్
చెన్నై : 'రంగం' ఫేమ్ జీవా, పూజాహెగ్డే కాంబినేషన్ లో ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాస్క్' . ఈ నెల 31న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో కథ గురించి మిస్కిన్ మాట్లాడుతూ... ఎవరికైనా అన్యాయం జరిగితే మనకెందుకులే అని పక్క నుంచి వెళ్లిపోయేవారుంటారు. మనసులో తిరగబడాలనే కోరిక ఉన్నా ధైర్యం చేయలేని వ్యక్తులు కొందరైతే, అతి కొద్దిమంది మాత్రమే అన్యాయానికి ఎదురు నిలబడి పోరాడతారు. ఇక్కడ మా హీరో కూడా తెలివితేటలతో అవినీతిపరుల అంతుచూస్తాడు. అది ఏ రీతిన అన్నది సస్పెన్స్ అన్నారు మిస్కిన్.
చిత్ర సమర్పకులు ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ ''సమాజ శ్రేయస్సుని కాంక్షించే ఓ యువకుడి చుట్టూ తిరుగుతుందీ కథ. అక్రమార్కుల్ని ఏరి పారేసేందుకు నడుం బిగిస్తాడు. ముసుగు వీరుడు పాత్రలో జీవా చక్కటి హావభావాలు ప్రదర్శించాడు. సూపర్ హీరో తరహా కథాంశంతో అల్లుకొన్నదీ చిత్రం'' అన్నారు. ఈ చిత్రాన్ని ఎన్.వి. ప్రసాద్, పారాస్ జైన్ నిర్మిస్తున్నారు. నరేన్, నాజర్, గిరీష్ కర్నాడ్, అనుపమ కుమార్ తదితరులు ఇతర పాత్రధారులు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ- జీవా సరికొత్తగా ఈ చిత్రంలో కన్పిస్తారని, కుంగ్‌ఫూ, బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్‌తో చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని, తమిళ, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నామని, ఇంతవరకూ జీవా ధరించని ఓ విభిన్నమైన పాత్ర ఈ చిత్రంలో ఉంటుందని తెలిపారు.
తమిళంలో 'ముగమూడి'గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో 'మాస్క్' అన్న పేరును ఖరారు చేశారు. ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మిస్కిన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: కె., కెమెరా: సత్య, ఎడిటింగ్: గౌగిన్, నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్, సమర్పణ: ఆర్.బి.చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్.


Click it and Unblock the Notifications











