Rajinikanth biopic బయోపిక్‌గా రజనీ జీవితం.. ఇండియాలోనే టాప్ నిర్మాత చేతికి ‘తలైవా’ హక్కులు!
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సైన్యాధికారులు, సామాజిక కార్యకర్తల జీవితాలకు కాస్తంత మసాలా యాడ్ చేసి వదులుతున్నారు మేకర్స్. వీటికి ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతూ వుండటంతో దర్శక నిర్మాతలు సైతం బయోపిక్‌లను వెతుకుతున్నారు. అయితే తెలుగులో నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీ .. బయోపిక్‌లకు ఓ బెంచ్ మార్క్‌గా నిలిచింది. దక్షిణాదిలో బయోపిక్‌లు తగ్గుతుండగా హిందీలో మాత్రం పెరుగుతోంది. నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలు, రియల్‌లైఫ్ డ్రామా వుండటంతో బయోపిక్‌లు తీసేందుకు బాలీవుడ్ యువ హీరోలు ఉత్సాహం చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితం బయోపిక్ రూపంలో రానుంది. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. భారత్‌తో పాటు విదేశాల్లోనూ రజనీకాంత్‌కు ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు రిలీజవుతుంటే చాలు అభిమానులకు పండుగ రోజు అనే విషయం తెలిసిందే.

ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్‌స్టార్‌గా ఎదిగారు రజనీ. తనతో పాటు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఫేడ్ అవుట్ అవ్వడమో, లేక చేతిలో సినిమాలు లేక రిటైర్‌మెంట్ ఏజ్ ఎంజాయ్ చేయడమో చేస్తున్నారు. కానీ రజనీ మాత్రం 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండటం , నిరాడంబర జీవితాన్ని గడపటం రజనీకి మాత్రమే చెల్లింది. తన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్న మంచి మనసు రజనీ సొంతం అని సినీ వర్గాలు చెప్పకొంటారు.

రజనీలో వీటిన్నింటికి మించి ఉన్న మరో కోణం.. సమకాలీన స్టార్ హీరోల్లో ఎవరికీ లేని లక్షణం ఆధ్యాత్మిక జీవితం. సినిమాలు, షూటింగ్‌లతో ఎంత బిజీగా వున్నా యోగా, ధ్యానం, ఆధ్యాత్మికతను ఆయన విడిచిపెట్టరు. ప్రతియేటా హిమాలయాల్లోని ఆశ్రమాల్లో గడిపి వరుసగా పలు పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలను సందర్శించడం రజనీని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు. వయసు పెరుగుతున్నా ఈ అలవాటును సూపర్‌స్టార్ నేటికీ ఆచరిస్తున్నారు.
ఒక సినిమాకు కావాల్సిన ముడి సరకు, మసాలా, డ్రామా రజనీకాంత్ జీవితంలో బోలెడు. ఎక్కడో మహారాష్ట్రలో శివాజీ రావ్ గైక్వాడ్‌గా పుట్టిన వ్యక్తి.. కర్ణాటకలో పెరిగి.. తమిళనాడులో తారాపథానికి చేరుకోవడమంటే మామూలు విషయం కాదు. ఇంతటి స్టార్ కావడానికి రజనీలో ఏముంది. అందగాడు, ఆజానుబాహుడు కాదు.. కేవలం కృషి, క్రమశిక్షణ, పట్టుదల ఆయను ఈస్థాయికి తీసుకొచ్చాయి. అందుకే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కన్ను రజనీపై పడ్డాయి.
హిందీ ఫిల్మ్ మేకర్ సాజిద్ నడియద్‌వాలా రజనీ బయోపిక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి ఎక్కించే అవకాశం వుందని టాక్. అంతా బాగానే వుంది కానీ.. రజనీ బయోపిక్‌లో ఎవరు నటిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆయన స్టైల్, మేనరిజం, యాక్టింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











