ఓటీటీలో మరో భారీ చిత్రం.. ఈసారి సూర్య వంతు వచ్చింది!!
ప్రస్తుతం ఓటీటీల హవా పెరిగిందని అందరూ ఒప్పుకునే సత్యమే. థియేటర్లు ఎప్పుడు పున: ప్రారంభం అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న చిత్రాలన్నీ ఓటీటీ బాట పట్టాయి. మంచి టాక్‌ను కూడా సొంతం చేసుకుని లాభాలను గడించాయి. అయితే పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి ఎటూ తేల్చుకోని విధంగా మారాయి. ఆ మధ్య ఓటీటీపై రిలీజ్ చేసేందుకు హీరోలు సుముఖంగా లేకపోయినా.. ప్రస్తుతం అందరికీ వేరే మార్గం కనిపించడం లేదు.
దిల్ రాజు నిర్మించగా నాని, సుధీర్ బాబు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం V. ఈ సినిమాపై ఎన్నో రకాలు వార్తలు రూమర్లు కుప్పులు తెప్పలుగా పుట్టుకొచ్చాయి. ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేయబోతోన్నారని రెండు మూడు నెలల క్రితమే లీకులు వచ్చాయి. అయితే వీటిని నాని, దిల్ రాజు వంటి వారు ఖండించారు. కానీ ఎట్టకేలకు వీరి ఓటీటీనే దిక్కైంది. సెప్టెంబర్ 5న అమెజాన్‌లో vని రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు.

ఇదే వరుసలో మరో చిత్రం వచ్చి చేరింది. వరుస పరాజయాల తరువాత సూరారై పోట్రూ (ఆకాశం నీ హద్దురా) అనే చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సూర్య. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే థియేటర్‌లో రిలీజ్ చేద్దామని భావించిన చిత్రయూనిట్.. నేడు సంచలన నిర్ణయం తీసుకుంది. థియేటర్లు ఇప్పట్లో ప్రారంభం కావని తెలుసుకున్న చిత్రయూనిట్.. అమెజాన్‌లో అక్టోబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించింది. మరి ఇదే బాటలో మిగతా చిత్రాలు కూడా వస్తాయేమో చూడాలి.


Click it and Unblock the Notifications











