సూర్య అతనికి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు: భావోద్వేగానికి లోనైన డైరెక్టర్..
'తాన్ సెరిందా కూట్టమ్'తో(తెలుగులో 'గ్యాంగ్') ఇటీవల మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో సూర్య మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాతో తనకు మంచి కమర్షియల్ హిట్ ఇచ్చినందుకు దర్శకుడికి ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు.
దర్శకుడు విఘ్నేశ్ శివన్ పై తన అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఖరీదైన కారును ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సూర్య తనపై చూపిన ప్రేమ వెల కట్టలేనిదని.. ఇందుకు ధన్యవాదాలు అని చెప్పారు. అయితే ఇంతటి ప్రేమకు తాను అర్హుడినేనా? అని కూడా ప్రశ్నించుకున్నారు.
తనలాంటి కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడానికి చాలా పెద్ద హృదయం కావాలని భావోద్వేగానికి గురయ్యారు. కాగా, గతంలోనూ పలువురు దర్శకులకు సూర్య కార్లు బహుమతిగా ఇచ్చారు. 'సింగం 3' దర్శకుడు హరికి, 'పసంగ 2' (తెలుగులో 'మేము') దర్శకుడు పాండిరాజ్‌కు అప్పట్లో కారు బహుమతిగా ఇచ్చారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం సూర్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్.జి.కె' సినిమాలో నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











