చిత్ర పరిశ్రమలో విషాదం.. హీరో కన్నుమూత, నటుడి మృతికి కారణమేంటీ?
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌కు చెందిన హీరో అభినయ్ కింగర్ కన్నుమూశారు. ఆయన వయసు 44 సంవత్సరాలు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున చెన్నైలో మరణించారు. అభినయ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. అనారోగ్యంతో పాటు సినిమాలకు దూరంగా ఉంటూ ఓ చిన్న ఇంట్లో ప్రభుత్వ క్యాంటీన్‌లో జీవనం సాగిస్తూ.. దుర్బర పరిస్థితుల్లో అభినయ్ కన్నుమూశారు.
అభినయ్ కింగర్ ప్రస్థానం:
ప్రముఖ మలయాళ నటి టీపీ. రాధామణి కుమారుడే అభినయ్ కింగర్. 1981 జూన్ 20న చెన్నైలో జన్మించిన అభినయ్.. 2002లో తళుల్లువదో ఇళమై అనే చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు మిత్రుడిగా నటించారు అభినయ్. ఆ తర్వాత జంక్షన్, కైయితుమ్ దూరత్, సక్సెస్, చిత్రకూడమ్, సింగార చెన్నై, దాస్, పొన్ మెగలై, వైరస్, తూడక్కమ్, సొల్ల సోల్ల ఇనిక్కుమ్, ఆర్ముగమ్, కార్తీక్ అనిత, కథై, ఆరోహణం, ఎండ్రెన్‌డ్రమ్ పున్నాగై చిత్రాలలో నటించారు. 2014లో చివరిసారిగా వల్లవనుక్కు పుల్లం ఆయుధం అనే చిత్రంలో కనిపించారు అభినయ్.

తల్లి మరణంతో ఒంటరి
సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి బిజీ అయ్యార్ అభినయ్. తన అందం, నటనతో యువతలో గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలో అభినయ్‌ని విధి చిన్నచూపు చూసింది. కాలేయ సంబంధిత అనారోగ్యం బారినపడిన ఆయన నరకయాతన అనుభవించారు. సినిమాల్లో నటించడానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. తల్లి రాధామణి ఉన్నంత కాలం చికిత్సకు, ఇతర ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. 2019లో తల్లి మరణంతో అభినయ్ కృంగిపోయారు. ఓ వైపున అనారోగ్యం, చేతిలో చిల్లి గవ్వ కూడా లేక రంగరాజపురంలోని ఓ చిన్న అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు.
మరణాన్ని ముందే ఊహించిన అభినయ్
అభినయ్ అనారోగ్య పరిస్ధితి గురించి తెలుసుకున్న తమిళ నటుడు కేపీవై బాలా చలించిపోయారు. వెంటనే అభినయ్‌ని కలిసి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ఆ సమయంలో బయటికొచ్చిన అభినయ్ ఫోటోలు చూసి ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖంపై చిరునవ్వు, అందంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలుగొందిన ఆయన బక్కచిక్కిపోయి, గుర్తుపట్టని విధంగా మారిపోయారు. దాంతో అభినయ్ తిరిగి కోలుకోవాలని, సినిమాలు చేయాలని అభిమానులు ఆకాంక్షించారు.
అంత్యక్రియలు చేసే దిక్కులేక
తను బాలాను కలిసినప్పుడే కాలేయ వ్యాధి చికిత్సకు అందని విధంగా ముదిరిపోయిందని, ఇంకో ఏడాది మాత్రమే బతుకుతానని చెప్పారు. అయితే బాలా మాత్రం నువ్వు కోలుకుని తిరిగి సినిమాలు చేస్తావని ధైర్యం చెప్పారు. చివరికి అభినయ్ చెప్పిందే జరిగింది.. ఏడాది లోపే ఆయన కన్నుమూశారు. అద్దె ఇంట్లో చనిపోవడంతో ఇంటి యజమాని .. అభినయ్ మృతదేహాన్ని తన ఇంట్లో ఉంచొద్దని వాదించారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా, పోలీసులు, తమిళనాడు హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ పూచి మురుగన్, నటుడు విజయ్ ముత్తుల జోక్యంతో అభినయ్ మృతదేహాన్ని అక్కడే ఉంచి అభిమానులు, సినీ ప్రముఖుల నివాళులకు అనుమతించారు. అభినయ్‌కి పెళ్లి కాకపోవడం, ఇతర కుటుంబ సభ్యులు లేకపోవడంతో ఆయన అంత్యక్రియలకు నడిగర్ సంఘం ముందుకొచ్చినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











