ధనుష్ సినిమాలపై నిషేధం.. అతనికి రెడ్ కార్డ్.. అసలు ఏం జరిగిందంటే?
చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన గుర్తింపు పొందాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటాడు. విలక్షణ నటనతో అబ్బురపరిచే ధనుష్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే.
ఇటీవల సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ధనుష్ కు నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. అతనిపై రెడ్ కార్డ్ జారీ చేస్తూ సినిమాలపై నిషేధం విధించనుందని టాక్. అసలు ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

తమిళ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లుగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు ధనుష్. సౌత్, నార్త్ చిత్రాలతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం మిల్లర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ సినిమాలపై నిషేధం పడనుందని టాక్ వినిపిస్తోంది. తమిళ నిర్మాత మండలి (TFPC) తాజాగా ధనుష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. అలా చర్యలు తీసుకుంటే ధనుష్ సినిమాలపై నిషేధం విధించడం గ్యారెంటీ అని తెలుస్తోంది.
గతంలో శ్రీ తేండ్రల్ ఫిలిమ్స్ నిర్మాణంలో ధనుష్ ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఇది జరిగి చాలా ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పటివరకు ధనుష్ సినిమా మాత్రం చేయట్లేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది.
ధనుష్ సినిమా చేయకుండా ఆలస్యం చేస్తున్నందుకు అతనికి నోటీసులు ఇవ్వాలని మండలిని కోరారు. దీంతో ధనుష్ కు మండలి రెడ్ కార్డ్ ఇవ్వనుందనే సమాచారం బయటకు వచ్చింది. ఈ విషయంపై ధనుష్ నుంచి సరైన సమాధానం రాకపోతే బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నాయని టాక్.
ఒకవేళ ఇది నిజమైతే ధనుష్ సినిమాలు ఇక ఉండవని తెలుస్తోంది. కాగా ధనుష్ లాగే పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు చేయడం లేదనే కారణంతో హీరోలు శింబు, విశాల్, ఎస్జే సూర్య, అథర్వతోపాటు కమెడియన్ యోగిబాబుకు తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇవ్వనుందనే న్యూస్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ రెడ్ కార్డ్ జారీ చేస్తే ఏ దర్శకనిర్మాతలు వీళ్లతో సినిమాలు చేయడం కుదరదు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లపై నిషేధం విధించినట్లే. గతంలో డైరక్టర్ శంకర్ తో ఇలాంటి వివాదం కారణంగానే కమెడియన్ వడివేలు ఏళ్లపాటు సినిమాలకు దూరమయ్యారు.


Click it and Unblock the Notifications











