సెక్సిజం, పితృస్వామ్యం కాన్సెప్టుతో అజిత్ మూవీ? ‘పింక్’ రీమేకా?
సెక్సిజం, పితృస్వామ్యం, సమ్మతి లాంటి అంశాలను ప్రధానంగా చర్చిస్తూ బాలీవుడ్లో తెరకెక్కిన చిత్రం 'పింక్'. అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 2016లో జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది.
'పింక్' చిత్రాన్ని ఇపుడు తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించబోతున్నారని, హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను అజిత్ చేస్తారని టాక్. డిసెంబర్లో ఈ మూవీ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే హిందీలో తాప్సీ పోషించిన పాత్రలో మరో హీరోయిన్‌ను తీసుకోబోతున్నారని, అందుకు తగిన నటి ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని 'తాలా59' అనే పేరుతో పిలుస్తున్నారు. అయితే మక్కీకి మక్కీ రీమేక్ చేయకుండా కేవలం మూల కథను మాత్రమే తీసుకుని తమిళ నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసి తెరకెక్కించబోతున్నారట. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు. అయితే ఇంకా అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు.
కాగా.. అజిత్ నటిస్తున్న 'విశ్వాసం' షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెట్ట'తో పోటీ పడుతూ విశ్వాసం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











