హేమ కమిటీ రిపోర్టా.. రజనీకాంత్ షాకింగ్ రియాక్షన్ , నాకేం తెలియదంటూ .. నెటిజన్ల ఫైర్
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్ధితులపై కేరళ ప్రభుత్వం నియమించిన జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్, మహిళలపై వేధింపులు వంటివన్నీ అన్ని భాషల్లో ఉన్నప్పటికీ.. మలయాళ ఇండస్ట్రీలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని హేమ కమిటీ పేర్కొంది. మలయాళ ఇండస్ట్రీ ఓ మాఫియా కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించింది. మహిళలు తమపై జరిగే లైంగిక దాడులపై నోరు విప్పలేకపోతున్నారని జస్టిస్ హేమ కమిటీ అభిప్రాయపడింది.
ఈ నివేదిక ద్వారా పలువురు నటీమణులు ధైర్యంగా ముందుకొచ్చి తమ పట్ల కొందరు ఎలా ప్రవర్తించినది, తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతున్నారు. పరిశ్రమలో పైకి పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న కొందరి నిజస్వరూపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉండటంతో ప్రజలు, సినీ వర్గాలు నోరెళ్లబెడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారి వివరాలను బహిర్గతం చేయాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్ఈఎఫ్‌కేఏ) అనుబంధ దర్శకుల యూనియన్ డిమాండ్ చేసింది.

మలయాళంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోయిన్లు , నటీమణులు కూడా బయటకొస్తుండటం ఆయా పరిశ్రమలకు చెందిన వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కమీషన్ వేయాలంటూ స్టార్ హీరోయిన్ సమంత డిమాండ్ చేయడం కలకలం రేపింది. మలయాళ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెరపైకి తీసుకురావడంలో కేరళలోని వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) చేసిన కృషిని సామ్ ప్రశంసించారు. టాలీవుడ్‌లోనూ ది వాయిస్ ఆఫ్ వుమెన్ ఏర్పాటైందని.. ఈ సబ్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని సమంత డిమాండ్ చేశారు.
భారతీయ చిత్ర పరిశ్రమలోనే తీవ్ర చర్చనీయాంశమైన జస్టిస్ హేమ కమిటీ గురించి తనకు తెలియదన్నారు ఓ స్టార్ హీరో. ఆయనెవరో కాదు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. తన తాజా చిత్రం వేట్టైయాన్ గురించి ఆయన మీడియాతో వివరాలు పంచుకున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. తన వేట్టైయాన్ కోసం ప్లేస్ ఇచ్చిన సూర్యకు రజనీకాంత్ థ్యాంక్స్ చెప్పారు. సూర్య నటించిన కంగువా కూడా హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదే సమయంలో విలేకరులు హేమ కమిటీ రిపోర్ట్ గురించి రజనీకాంత్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ హేమ కమిటీయా.. తనకు తెలియదు, సారీ అంటూ బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తలైవాపై భగ్గుమంటున్నారు. గత కొద్దిరోజులుగా చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న ఇష్యూ గురించి తెలియదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై రజనీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











