బిగ్ బాస్ 3 హౌస్‌లోకి ఎంటరై వనితను విచారించిన పోలీసులు, ఏం జరిగిందంటే?
తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా కొనసాగుతున్న 'బిగ్ బాస్ తమిళ్ 3' హౌస్‌లోకి తెలంగాణకు చెందిన అల్వాల్ పోలీసులు ఎంటరయ్యారు. ఇందులో కంటెస్టెంటుగా ఉన్న తమిళ నటి, విజయ్ కుమార్ కూతురు వనితను పోలీసులు విచారించారు. వనిత మాజీ భర్త ఆనంద్ రాజన్ తన కూతురును కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం.
తమిళ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. బుధవారం (జులై 3)న చెన్నైలోని నజ్రత్‌పేట్ పోలీసుల అనుమతితో తెలంగాణ పోలీసులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది. ఆనంద్ రాజన్ ఫిర్యాదుకు సంబంధించి ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.

నా కూతురు ఇష్టంతోనే
విచారణలో వనిత... తన కూతురు ఇష్టపూర్వకంగానే హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చిందని, ఆమెను తాను కిడ్నాప్ చేయలేదని తెలిపినట్లు సమాచారం. ఆమె తన వద్ద ఉండటానికి ఇష్టపడిందని, అందుకే తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

కూతురు జోవితను బిగ్‌బాస్ హౌస్‌కు తీసుకొచ్చిన పోలీసులు
పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, అయితే తన కూతురు జోవిత స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత తనను అరెస్ట్ చేయాలని వనిత సూచించడంతో.... ఆమెను కూడా పోలీసులు బిగ్ బాస్ హౌస్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల ముందు ఆ పాప.... తాను ఇష్టపూర్వకంగానే వచ్చానని, ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పడంతో పోలీసులు వెను దిరిగినట్లు సమాచారం.

వనితను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం
తెలంగాణ పోలీసులు చెన్నై రావడంతో వనితను బిగ్ బాస్ 3 హౌస్ నుంచి అరెస్ట్ చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లకు తెర దించుతూ బిగ్ బాస్ షోను డిస్ట్రబ్ చేయకుండానే తెలంగాణ పోలీసులు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

2012లో విడాకులు
వనిత-ఆనంద రాజన్ వివాహం 2007లో జరిగింది. అయితే 2012లో వీరు పరస్పర అంగీకరాంతో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఫ్యామిలీ కోర్టు కూతురు జోవిత కష్టడీ తండ్రికి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. తన కూతురును అప్పుడప్పుడు కలిసేందుకు వనితకు హక్కు కల్పించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జోవితను అనిత తీసుకెళ్లడంతో ఆనంద్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Click it and Unblock the Notifications











