కించ పరిచారా? ఆ తమిళ సినిమాపై తెలుగువారి ఆగ్రహం!
హైదరాబాద్: తమిళ హాస్య నటుడు వడివేడు హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం 'తెనాలి రామన్'. ఈ చిత్రంలో తెనాలి రామకృష్ణ పాత్రతో పాటు శ్రీకృష్ణ దేవరాయల పాత్రను కూడా వడివేలు పోషించారు. అయితే ఈ చిత్రంపై తాజాగా వివాదం నెలకొంది. ఇందులో కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ పాత్రలను వ్యంగ్యంగా, కించపరిచే విధంగా చిత్రీకరించారంటూ కొన్ని తెలుగు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల విడుదలైన 'తెనాలి రామన్' థియేట్రికల్ ట్రైలర్ చూస్తే మా అనుమానాలు బలమయ్యాయని, సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని పలు తెలుగు సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే ఇందుకు చిత్ర దర్శక నిర్మాతలు ససేమిరా అంటున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో 'తెనాలి రామన్' చిత్రం విడుదల ఆపాలని తెలుగు సంఘాల వారు తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, ముఖ్యమంత్రి జయలలితకు, సెన్సార్ బోర్డు వారికి వినతిపత్రం సమర్పించారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో తెలుగువాళ్లు వినతిపత్రం సమర్పించారు.
కృష్ణదేవరాయలు తెలుగు ప్రజల ఆరాధ్యుడని, అతను కవిపోషకుడిగా, ధార్మికకర్తగా ఎన్నో దేవాలయాలు నిర్మించాడని, కృష్ణదేవరాయలు నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించిన ధార్మిక సంస్థ అని వారు వినతిపత్రంలో చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం విడుదలకు ఇబ్బందులు తప్పవని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











