సన్ పిక్చర్స్ పై తెలుగు నిర్మాత కేసు
శ్రీరామ్, పృధ్వీరాజ్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో పినాకిల్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చల్లా మన్ మోహన్ నిర్మించి,దర్శకత్వం వహించిన చిత్రం 'పోలీస్ పోలీస్'. ఈ చిత్రం తమిళ డబ్బింగ్ విషయంలో తనను మోసం చేసారంటూ సన్ పిక్చర్స్ నిర్వాహక అధికారి సక్సేనాపై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ నిర్మాత చల్లా మన్మోహన్ చెన్నై పోలీసు కమిషనర్ త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన తాను పినాకిల్ పిక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థతో తెలుగు చిత్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2008లో కోజికోడ్‌కు చెందిన దివ్య పిక్చర్స్ అధినేత రవి తన కార్యాలయానికి వచ్చారని పేర్కొన్నారు. తాను నిర్మించి, దర్శకత్వం వహించిన పోలీసు చిత్రానికి సంబంధించిన తమిళ అనువాద హక్కులు కోరారని తెలిపారు. ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన సూచన మేరకు చెన్నైలోని గ్రీన్ ఆపిల్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత మహ్మద్ సాధిక్‌ను కలుసుకున్నానని వెల్లడించారు.
సాధిక్, రవి తనను సన్ నెట్‌వర్క్ కార్యాలయానికి తీసుకెళ్లి సక్సేనాను పరిచయం చేశారని తెలిపారు. తన చిత్రం తమిళ అనువాద హక్కులను రూ.2.1 కోట్లకు అమ్మేలా ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. రవి ఆయన సతీమణి పేరుపై ఒప్పంద ప్రతాలను తయారు చేశారని వెల్లడించారు. తనను బలవంతంగా ఒప్పించి రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారని తెలిపారు. మిగతా డబ్బు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని తెలిపారు. తర్వాత కొద్ది రోజులకు రవి ఇచ్చినట్లుగా సక్సేనా పది లక్షలు ఇచ్చారని పేర్కొన్నారు. పూర్తి డబ్బులు చెల్లించాలని తాను ఒత్తిడి చేయడంతో సక్సేనా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పలుమార్లు తనపై భౌతికదాడులు చేయించారని పేర్కొన్నారు. అధికార బలంతో సక్సేనా తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











