హీరో విజయ్ కి వూహించని షాక్ ...(ఫోటో ఫీచర్)
చెన్నై: తన తాజా చిత్రం 'తలైవా'..(అన్న) విడుదలకు మార్గం సుగుమం చేయాలంటూ ముఖ్యమంత్రికి స్వయంగా విన్నవించుకునేందుకు విజయ్ ప్రయత్నించగా 'అమ్మ' కనీసం అందుకు అనుమతి కూడా ఇవ్వకపోవటం విజయ్ కు షాక్ అయ్యింది అపై చిత్ర నిర్మాత చంద్రప్రకాష్ జైన్, దర్శకుడు ఏఎల్ విజయ్‌లు కమిషనర్‌ను కలుసుకుని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే శనివారం రోజున తలైవా ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది.
విజయ్ అభ్యర్థను తోసిపుచ్చుతూ ఆయన చేపట్టాలనుకున్న దీక్షకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై ఘాటుగా స్పందించిన పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రామదాసు, శాంతిభద్రతులు పరిరక్షణ, నేరాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన పోలీసుశాఖ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే పనిచేస్తోందని, తలైవా చిత్ర విడుదలను కూడా అడ్డుకుంటూ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుందని ఆరోపించారు.
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా దీనిపై ప్రత్యేకంగా స్పందించారు. పది రోజులైనా తలైవా చిత్రం విడుదలకు నోచుకోకపోవటంపై తాను కలత చెందానని పేర్కొన్నారు. డీఎంకే పార్టీ ఎమ్మెల్యే జె.అన్బళగన్ మరో అడుగు ముందుకేసి విజయ్‌కు బాహాటంగానే మద్దతు ప్రకటించారు. చిత్ర నిర్మాత చంద్రప్రకాష్ జైన్ శనివారం ఉదయం గుండెపోటుకు గురై నగరంలోని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు.
మిగతా కథనం..స్లైడ్ షోలో...

ఆ సినిమాకి అలా...
గత సార్వత్రక ఎన్నికలకు కాస్త ముందుగా తాను నటించిన 'కావలన్' చిత్రానికి థియేటర్లను కేటాయించకపోవటంపై అప్పటి అధికారంలోని డీఎంకేపై అలకబూనిన విజయ్, ఎన్నికలకు ముందుగా తన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌తో కలిసి అన్నాడీఎంకేకు 'జై' కొట్టాడు. తద్వారా తొలిసారిగా ఆయన రాజకీయంగానూ వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించిన తర్వాత విజయ్‌కు మంచిరోజులొచ్చాయి అనుకున్నారు.

'తలైవా' నే చర్చనీయాంసం
అయితే గత పదిరోజుల కిందట పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రంజాన్ కానుకగా విడుదల కావాల్సిన విజయ్ 'తలైవా' చిత్రం ఒక్కసారిగా చర్చనీయాంశం అయ్యింది. థియేటర్లకు బాంబు బెదిరింపు వచ్చిందంటూ, ప్రజలు భద్రత దృష్ట్యా చిత్రాన్ని ప్రదర్శించలేమంటూ థియేటర్ల యజమానులు చేతులెత్తేశారు. చిత్రం విడుదలయ్యేలా థియేటర్లకు పోలీసు భద్రత కల్పించాలంటూ చిత్ర యూనిట్ చేసుకున్న అభ్యర్థనను పోలీసులు తోసిపుచ్చారు.అయితే విజయ్‌తో పాటు, ఆయన అభిమానులను నివ్వెరపరిచిన విషయం మాత్రం ఆపైనే చోటుచేసుకుంది.

అది పద్దతి కాదు...
డీఎంకే పార్టీ ఎమ్మెల్యే జె.అన్బళగన్ మరో అడుగు ముందుకేసి విజయ్‌కు బాహాటంగానే మద్దతు ప్రకటించారు. సినీ నిర్మాత కూడా అయిన ఆయన రాష్ట్రంలో తన పరిధిలో 300 థియేటర్లు ఉన్నాయని, ఆ థియేటర్లలలో తలైవాను ప్రదర్శించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాను డీఎంకే పార్టీ ఎమ్మెల్యేగా ఈ విషయాన్ని పేర్కొనటం లేదని, ఓ నిర్మాతగా, సహ నిర్మాతల సమస్యలు తనకు తెలసని, రూ.కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాల విడుదలను అడ్డుకోవటం సరికాదన్నారు.,

శరత్‌కుమార్ తీరు తప్పు
ఈ సందర్భంగా ఆయన నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ తీరును కూడా తప్పపట్టారు. రాజకీయ నేతగా ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పటికీ, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా తలైవా విడుదలకు చొరవ తీసుకోకపోవటం, ఇప్పటి వరకు కనీసం స్పందించలేని ఆయన వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తండ్రి గుండె పోటు...
ఇదిలా ఉంటే చిత్ర విడుదలకు సహకరించాలని రెండు రోజుల కిందట విజ్ఞప్తి చేసిన చిత్ర నిర్మాత చంద్రప్రకాష్ జైన్ శనివారం ఉదయం గుండెపోటుకు గురై నగరంలోని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇక చిత్ర విడుదలకు అడ్డుపడటంపై సవాలు చేస్తూ విజయ్ తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

'తలైవా'.. అంటే ...
'తలైవా'.. అంటే అధ్యక్షా అని అర్థం. రాజకీయ నాయకులను, తమను బాగా అభిమానించే వారిని తమిళ తంబీలు ప్రేమతో ఇలా పిలుస్తుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో గల్లీ స్థాయిలో చోటు సంపాదించినా.. వారంతా తమ వారికి తలైవర్ అయిపోతుంటారు. అలాంటి పేరు పెట్టినందుకేనేమో.. విజయ్ కొత్త చిత్రం రోజురోజుకూ రాజకీయ రంగు పులుముకుంటోంది.

రాజకీయ రంగు...
చిత్ర విడుదలపై ఇప్పటి వరకు ఓ స్పష్టమైన హామీ రాకపోగా, విజయ్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించటం, చిత్ర నిర్మాత గుండెపోటుతో ఆసుపత్రిలో చేరటం, చిత్రాన్ని ప్రదర్శించేందుకు తాను సిద్ధం అంటూ డీఎంకే మాజీ ఎమ్మెల్యే ముందుకు రావటం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, పీఎంకే నేత రామదాసులు విజయ్‌కు అండగా నిలవటం రాష్ట్రంలో 'తలైవా' కేంద్రంగా రాజకీయ వేడి రాజుకుంటోంది.

అభిమాని ఆత్మహత్య
ఈ సినిమా విడుదల కాకపోవడంతో నిరాశకు గురైన అభిమానులు థియేటర్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. సినిమా విడుదల కాలేదనే బాధతో కోవైకి చెందిన విష్ణుకుమార్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విజయ్ సంతాపాన్ని ప్రకటించారు.

రిస్క్ తీసుకోలేం...
అంతా సెట్ అవుతోంది రిలీజ్ చేద్దామనుకుంటే... రెండురోజుల కిందట మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చినట్టు చెన్నై థియేటర్ యజమానుల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ తెలిపారు. ఎవరూ రిస్క్ తీసుకోవటానికి సిద్దం లేమని వారు తెగేసి చెప్పారు.

మార్కెట్‌లోకి పైరసీ సీడీలు
'తలైవా' తమిళ వెర్షన్ కెనడా, మలేషియా, సింగపూర్‌తో పాటు రాష్ట్రంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో విడుదల కావడంతో పైరసీ సీడీలు దర్శనమిస్తున్నాయి. విజయ్ అభిమానులు సేలంలో వాటిని గుర్తించి ధ్వంసం చేసి నిందితుల్ని పోలీసులకు పట్టించారు. మరో ప్రక్క ఇక్కడ తెలుగు నుంచి కూడా పైరసీ మొదలైంది.

ఆన్ లైన్ తలనొప్పి...
టోరెంట్స్, డౌన్ లోడ్స్ తో ఈచిత్రం తెలుగు, తమిళ వెర్షన్స్ నెట్ లో దొరికేయటంతో ఆసక్తి ఉన్న వారు ఈ చిత్రాన్ని చూసేస్తున్నారు. దాంతో రిలీజైనా పెద్ద ఉపయోగం ఉండదంటూ వినిపిస్తోంది. సినిమా రిలీజయ్యాక ఎలాగో తప్పని ఈ పైరసీ తలనొప్పి..రిలీజ్ కు ముందే ఉండటం విజయ్ ఫ్యాన్స్ ని కలిచివేస్తోంది.

కొత్త రిలీజ్ డేట్
ఈ చిత్రం ఆగస్టు 20 న విడుదల అయ్యే అవకాసం ఉందని తాజా సమాచారం. అయితే ఇప్పటికే రిలీజైన చోట్ల ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చేసింది. తెలుగులో డిజాస్టర్ చిత్రంగా దీన్ని ట్రేడ్ వర్గాలు నిర్దారించాయి. ఈ నేపధ్యంలో ఈ టాక్ నెట్ ద్వారా తమిళనాట స్ప్రెడ్ అయ్యి ..రిలీజ్ టైమ్ కు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











