కమల్ హాసన్‌కు షాక్... రజనీకాంత్ మూవీ నుంచి టాప్ డైరెక్టర్ ఔట్
లెజండరీ డైరెక్టర్ కే. బాలచందర్ భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన ఆణిముత్యాలు కమల్ హాసన్, రజనీకాంత్. నటనకు, స్టైల్‌కు మారుపేరుగా నిలిచిన ఈ ఇద్దరు దిగ్గజాలు దశాబ్ధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు వీరిద్దరూ 21 సినిమాలలో కలిసి నటించారు. వీటిలో మల్టీస్టారర్ కొన్ని అయితే ఇద్దరూ గెస్ట్ రోల్స్ చేసిన సినిమాలు మరికొన్ని. 1985లో చివరిసారిగా హిందీలో గెరాఫ్టర్ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్స్ పోషించగా.. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమా తర్వాత రజనీ- కమల్ హాసన్ కలిసి నటించలేదు.
46 ఏళ్ల తర్వాత సెట్ అయిన కాంబో
అయితే దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇద్దరూ లీడ్ రోల్స్‌లో మల్టీస్టారర్ చేయనున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా ప్రకటించారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు, ఒకరితో ఒకరు పోటీ అని కూడా అనుకోలేదన్నారు. మేమిద్దరం కలిసి నటించేందుకు ఎన్నో అవకాశాల కోసం ఎదురుచూశామని.. అలాగే ఒకరి నిర్మాణంలో మరొకరు నటించాలని కూడా అనుకున్నామని కానీ కుదరలేదు. కానీ ఈసారి మాత్రం తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజనీకాంత్ నటించబోతున్నారని కమల్ ప్రకటించారు.

రజనీ కెరీర్‌లో 173వ సినిమా
రజనీకాంత్ కెరీర్‌లో 173వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తలైవర్ 173 వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ - రజనీకాంత్ నటించనున్నారని.. వీరిద్దరూ గ్యాంగ్‌స్టర్లుగా కనిపించబోతున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత రజనీతో జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ ఊహాగానాలకు కమల్ హాసన్ చెక్ పెట్టారు. రజనీతో తాను నిర్మించబోయే సినిమాను సీనియర్ దర్శకుడు సుందర్ సి టేకప్ చేస్తారని తెలిపారు. రజనీ, సుందర్‌లను తన నివాసానికి పిలిపించిన కమల్.. ఇద్దరినీ సత్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దర్శకుడిగా సుందర్ సి వద్దు
దాంతో తమిళ చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది. ప్రస్తుతం ఎందరో కుర్ర డైరెక్టర్లు మంచి ఊపులో ఉండగా.. సుందర్‌కి వీరిద్దరూ ఛాన్స్ ఎలా ఇచ్చారని చర్చ జరిగింది. అయితే తమిళనాట పక్కా కమర్షియల్ డైరెక్టర్‌గా సుందర్ సీకి పేరుంది. స్టార్ హీరోయిన్ ఖుష్బూ భర్తే ఈ సుందర్. గతంలో రజనీకాంత్‌తో అరుణాచలం వంటి బ్లాక్‌బస్టర్ తీశారు. అలాగే కమల్‌తో అన్బే శివం అనే సినిమాను తీసి హిట్ కొట్టారు సుందర్. అయితే వయసు, ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సుందర్ .. ఈ సినిమాను తెరకెక్కించగలరా? అంటూ కమల్, రజనీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే దర్శకుడిగా సుందర్‌కు మద్ధతు పలికేవారు కూడా ఉన్నారు. ఇటీవలే అరణ్మనైతో భారీ విజయాన్ని సుందర్ సాధించిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు.
రజనీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నా
అయితే ఇంతలోనే సుందర్ సీ షాకిచ్చారు. కమల్ హాసన్ - రజనీకాంత్ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా నోట్ కూడా రిలీజ్ చేశారు. ఊహించని, అనివార్య పరిస్థితుల కారణంగా ముఖ్యమైన వార్తను పంచుకుంటున్నాను. ప్రతిష్టాత్మక తలైవర్ 173 ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. లెజండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా.. ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మించనున్న ఈ వెంచర్ ద్వారా నా కల నిజమైంది. జీవితంలో మన కలలు వేరుగా ఉన్నప్పటికీ.. మన కోసం నిర్దేశించిన మార్గాన్ని అనుసరించాల్సిన క్షణాలు ఉంటాయి. ఈ ఇద్దరు దిగ్గజాలతో నా అనుబంధం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా మేం పంచుకున్న క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అవి నాకు అమూల్యమైన పాఠాలు నేర్పించాయి అని సుందర్ తెలిపారు.
పోస్ట్ డిలీట్ చేసిన ఖుష్బూ
ఈ వెంచర్ నుంచి తప్పుకుంటున్నప్పటికీ వారి మార్గదర్శకత్వాన్ని కోరుకుంటూనే ఉంటా. ఈ గొప్ప ప్రాజెక్ట్ కోసం నన్ను పరిశీలనలోకి తీసుకున్న ఇద్దరు లెజెండ్స్‌కి నా కృతజ్ఞతలు. ఈ వెంచర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారిని నా నిర్ణయం నిరాశపరిచినట్లయితే క్షమించండి. ఎప్పటికీ మీకు ఉత్సాహాన్ని కలిగించే వినోదాన్ని అందిస్తుంటూనే ఉంటానని సుందర్ సి రాసుకొచ్చారు. ఈ నోట్‌ను సుందర్ సతీమణి ఖుష్బూ తొలుత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందో కానీ ఈ పోస్ట్‌ని వెంటనే డిలీట్ చేశారు. దాంతో కోలీవుడ్ వర్గాలు, ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











