Vijay Political Party తమిళనాడులో దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ .. దాని పేరు, అర్థం ఏంటో తెలుసా?
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి రావడం ఖరారైపోయింది. అయితే ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా స్వయంగా పార్టీని పెట్టారు. దీంతో తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. దానికి తమిళగ వెట్రి కళగం అనే పేరును ఖరారు చేసి, ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించారు విజయ్. అవినీతి నిర్మూళన కోసమే ఆయన పార్టీ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ పార్టీ పేరుకు అర్థం ఏంటి, విజయ్ లక్ష్యం ఏంటి అనేది ఇప్పుడు వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో దళపతి విజయ్ ఒకరు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంటారు. గతేడాది డిసెంబర్ సమయంలో వరదలతో అతలాకుతలమైన తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో పర్యటించి మరీ బాధితులకు అండగా నిలిచారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు జిల్లాల వారిగా నగదు బహుమతిని అందించారు. ఆ సమయంలో ఓటుకు నోటు అంశంపైనా కూడా మాట్లాడారు.

ఇప్పటికే ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం రాజకీయ కార్యక్రమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని గత కొద్ది కాలం నుంచి గట్టిగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ విజయ్ దళపతి కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. ఎలాగో ఆయన మొదటి నుంచి సామాజిక అంశాలపై కాస్త గట్టిగానే స్పందిస్తూ ఉంటారు. అలానే ఆయనకు రాజకీయ అంశాలపైన కూడా మొదటి నుంచి ఆసక్తి ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో తరచూ తన అభిమాన సంఘాలతో సమావేశాలు కూడా నిర్వహించారు.
ఇప్పుడు వారితో సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ పేరును ఖరారు చేస్తూ రిజిస్టర్ చేయించారు. తమిళనాడు సెంటిమెంట్ కలిసి వచ్చేలా తమిళ వెట్రి కళగం పేరును ఫిక్స్ చేశారు. అంటే దీని అర్థం తమిళనాడు సక్సెస్ పార్టీ. వెట్రి అంటే విజయం, కళగం అంటే పార్టీ అనే అర్థం వస్తుంది. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయమని వెల్లడించారు విజయ్. అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. త్వరలోనే తమ జెండా, ఎజెండా అనౌన్స్ చేస్తామని విజయ్ పేర్కొన్నారు.2026లో జరిగే శాసనసభ ఎన్నికలే ఆయన లక్ష్యంగా తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయ్యాకే పూర్తి ఫోకస్ రాజకీయాలపై పెట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పార్టీ అధికార పక్షంలో ఉంది. సీఎం స్టాలిన్‌కు దీటిగా సరైన నాయకుడిగా ఇంకెవరూ లేరనే వాదన కూడా వినిపిస్తోంది. అన్నాడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నప్పచికీ అంతగా ప్రభావం చూపలేకపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. భాజాపా తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై కొంచెం దూకుడుగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం కూడా అంతగా కనపడట్లేదు.
ఇప్పటికే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టారు కానీ విజయం సాధించలేకపోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తానని చెప్పి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. దీంతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని భావించిన విజయ్.. సుదీర్ఘ చర్చలు తర్వాత ఈ కొత్త పార్టీని పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీని అనౌన్స్ చేశారు. మరి ఆయన ఎంట్రీ దేశ, తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి..
సినిమాల విషయానికొస్తే.. తమిళంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్‌ను అందుకుంది విజయ్ దళపతే. ఆయన స్టార్ డమ్ వెనుక తెలుగు చిత్రాల ప్రభావం కూడా ఉందనే మాట కూడా వినిపిస్తుంటుంది. విజయ్ తన కెరీర్‌లో పోక్కిరి, గిల్లి, బద్రి, ఆది, వేలాయుధం, యూత్ వంటి ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అవి ఆయన సినీ కెరీర్‌ను మలుపుతిప్పి భారీ సక్సెస్‌ను అందించాయి. ఆయన ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను అనుకరించేవారు. ఆయన పాటలు, సినిమాలను ఎక్కువగా రీమేక్ చేశారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు.
అలాగే విజయ్ అభిమానులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏడాదిలో కనీసం రెండుసార్లైనా నేరుగా సమావేశమై వారితో కలిసి గడుపుతారు. వారితో కలిసి భోజనం చేయడం, బహుమతులు ఇవ్వడం కూడా చేస్తారు. అందుకే ఆయన తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











