జన నాయగన్ రిలీజ్‌పై రాజకీయ కుట్ర? సెన్సార్ అడ్డంకుల వెనుక.. విజయ్ పార్టీ ఆరోపణలు
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం జన నాయగన్. దాదాపు 32 సంవత్సరాలుగా తన నటన, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు విజయ్. ఇప్పటి వరకు సినీనటుడిగా వినోదాన్ని పంచిన ఆయన.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల కోసం తమిళగ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దిగారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు దళపతి.
పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గాను సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని.. జన నాయగన్ చిత్రం తన సినీ జీవితంలో చివరి సినిమా అని విజయ్ అధికారికంగా ప్రకటించారు. మలేషియాలో జరిగిన జన నాయగన్ ఆడియో లాంచ్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. దాంతో జన నాయగన్ చిత్రంపై కోలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ మరో 3 రోజుల్లో ఉండగా.. ఇప్పటి వరకు జన నాయగన్ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ లభించలేదు. దాంతో తమ నాయకుడి సినిమాపై రాజకీయంగా కక్షసాధిస్తున్నారని.. సినిమా విడుదల కాకుండా కుట్ర చేస్తున్నారంటూ టీవీకే కేడర్ ఆరోపిస్తోంది.

జన నాయగన్ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వ వహించారు. దళపతి విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే జన నాయగన్‌పై భారీ అంచనాలుండగా.... రిలీజ్‌కు మూడు రోజులే ఉండటంతో ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో విజయ్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. గత నెలలోనే ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ కొన్ని సూచనలతో పాటు దాదాపు 64 కట్స్ చెప్పింది. దాంతో సెన్సార్ బోర్డ్ ఆదేశాల మేరకు మార్పులు, చేర్పులు చేసి కొత్త వెర్షన్‌లో సెన్సార్ బోర్డ్ రివ్యూకు పంపించింది. అయినప్పటి సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికేట్ రాలేదు. మరోవైపు.. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపుతున్నామని ముంబైలోని కార్యాలయాన్ని సంప్రదించాలని చిత్ర యూనిట్‌కు బోర్డ్ సూచించింది. అయితే ఇదంతా కావాలని జరుగుతున్నట్లుగా ఉందంటూ చిత్ర నిర్మాణ సంస్థ.. మద్రాస్ హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిగణనలోనికి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం జనవరి 6వ తేదీన విచారణ జరిపింది.
సీబీఎఫ్‌సీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్ వాదనలు వినిపించారు. సెన్సార్ నుంచి ధృవీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే విడుదల తేదీని ప్రకటించారని వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. రివైజ్ కమిటీకి పంపిన సంబంధిత పత్రాలను సమర్పించాల్సిందిగా సెన్సార్ బోర్డ్‌ను ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై టీవీకే పార్టీ నేతలు మండిపడుతున్నారు. జన నాయగన్ విడుదల కాకుండా రాజకీయంగా కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. సెన్సార్ పూర్తి కాకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని మండిపడుతున్నారు.
జన నాయగన్‌కు సెన్సార్ ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్, విజయ్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సెన్సార్ రిపోర్ట్ ఆలస్యమైతే.. ప్రపంచవ్యాప్తంగా జన నాయగన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్, రిలీజ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక, కేరళ, ఓవర్సీస్‌లో జన నాయగన్ టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా.. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిరీక్షిస్తున్నారు. బుధవారం హైకోర్టు తీర్పుపైనే జన నాయగన్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఏదైనా తేడా వస్తే సంక్రాంతి రేసు నుంచి దళపతి విజయ్ తప్పుకోవాల్సిందే. దాంతో అంతా కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











