విజయ్ దళపతి బిగ్ మాస్టర్ ప్లాన్.. మొత్తం 234 నియోజకవర్గాల్లో అదే లక్ష్యంగా.. పాలిటిక్స్ కన్ఫామే!
ఇళయదళపతి విజయ్.. తమిళ నాట అభిమానులకు ఆరాధ్య దైవమన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో లియో చిత్రం చేస్తున్న ఆయన.. త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశంలో భాగంగా భారీ ఎత్తున ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...
ఆ వ్యూహంతోనే... విజయ్ దళపతి.. ఇండియాలోని బిజియెస్ట్ యాక్టర్లలో ఒకరు. అయితే ఇప్పుడాయన తన భవిష్యత్ కార్యాచరణను భారీగా రచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంతగా త్వరగా లియో సినిమా, అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. ఆ వెంటనే.. పార్లమెంట్ ఎన్నికల్లోపు పార్టీని ప్రకటించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారట. ఇప్పటికే ఈ విషయమై తన అభిమాన సంఘాల నాయకులతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

సామమాజిక సేవల్లోనూ జోరుగా.. దళపతి ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన విజయ్ మక్కల్ ఇయాక్కమ్ సంఘంతో ఎప్పడూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు.. పాలిటిక్స్ పై ఆయనకున్న ఆసక్తిని సూచిస్తున్నట్లుగా అనిపిస్తోంది. యువతను లక్ష్యంగా చేసుకుని విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. తమిళనాడులో 2026లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. అప్పటికీ ఓటు హక్కు సాధించే విద్యార్థులు, అలాగే ఇప్పుడు ఉన్న యువతపై దళపతి బాగా ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది.
విద్యార్థులకు నగదు బహుమతి.. కొద్ది రోజుల క్రితం విజయ్ దళపతి.. తమిళనాడులోని 234 అన్ని నియోజకవర్గాల్లోనూ 10, ఇంటర్ లో టాపర్ గా నిలిచిన మొదటి మూడు స్థానాల్లోని విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు. అలాగే ఆ కార్యక్రమంలో విజయ్ రాజకీయాల గురించి మాట్లాడారు. ఓటుకి నోటు విధానం మంచిది కాదంటూ.. దానికి దూరంగా ఉండాలంటూ విద్యార్థులకు సూచించారు. దీంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఆ తర్వాతే తన అభిమాన సంఘాల నాయకులతో ఓ సైలెంట్ మీటింగ్ ను ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి రావాలని ప్రణాళికలు రచించడం ప్రారంభించారట.

భారీ ప్లాన్ ను అమలు చేసేలా.. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో భారీ ప్లాన్ ను అమలు చేసేందుకు రెడీ అయ్యారని తెలిసింది. ఇది కూడా విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమ కారుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత కుమారస్వామి కామరాజ్ జయంతి జులై 15న.. ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అన్నీ నియోజకవర్గాల్లోనూ... రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లోనూ విద్యార్థుల కోసం నైట్ స్టడీ సెంటర్స్ ను ప్రారంభించనున్నారని సమాచారం అందింది. ఇకపోతే ఆయన త్వరలోనే ఈ రాజకీయాల కోసం పాదయాత్ర కూడా చేస్తారని అంటున్నారు. మొత్తంగా ఇవన్నీ చూస్టుంటే.. యువతకి బాగా ఉపయోగపడేవే కానీ.. ఇదంతా రాజకీయ కోసమేనని అంతా అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతాయి.


Click it and Unblock the Notifications











