పెద్ద మనసు చాటుకున్న ఇళయదళపతి, వేతనంలో 20శాతం కోత విధించుకున్న విజయ్
కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ మరోసారి పెద్ద మనసు చాటుకుని, అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఆపత్కాలంలో కష్టంలో ఉన్నవారికి అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుండే విజయ్, కరోనా కాలంలోనూ తన కర్తవ్యాన్ని మరచిపోలేదు. తన తదుపరి చిత్రానికి అందుకునే పారితోషకంలో 20శాతం కోత విధించుకుని తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
డైనమిక్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విజయ్ తదుపరి చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది విజయ్ 65వ చిత్రం కావడం ఓ విశేషం కాగా, సన్ పిక్చర్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గానూ ఇళయదళపతి ఏకంగా 100కోట్ల రూపాయిలు పారితోషకంగా పుచ్చుకుంటున్నాడని వినికిడి. అయితే ఈ పారితోషకంలో విజయ్ 20శాతం తగ్గించుకోబోతున్నాడన్నది తాజా వార్త.

కోవిడ్ 19 వల్ల సినీ పరిశ్రమ మొత్తం స్థంభించిపోవడంతో, నిర్మాతలకు అండగా నిలబడాలన్న ఆలోచనతోనే విజయ్ 20కోట్ల పారితోషకం వదులుకోనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనుండగా, రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది.
మరోవైపు విజయ్ తాజా చిత్రం మాస్టర్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 9న సినిమా విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ, కరోనా వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న మాస్టర్, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











