రజనీకాంత్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఫ్యాన్స్ ఫైర్
హైదరాబాద్: రజనీకాంత్ ‘లింగా' చిత్రం విషయంలో తమిళనాడులో పెద్ద గొడవే జరుగుతోంది. నష్టపోయిన తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ గత కొంత కాలంగా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేస్తున్నారు. త్వరంలో ధర్నా, నిరాహార దీక్ష చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.
అయితే ‘లింగా’ నష్టాల విషయంలో రజనీకాంత్ ను బాధ్యుడిని చేయడం తగదని తమిళ నటుల సంఘమైన ‘నడిగర సంఘం’ స్పష్టం చేసింది. ఏమైనా ఉంటే నిర్మాతతో తేల్చుకోవాలి. రజనీకాంత్ ను బ్లేమ్ చేయడం తగదని పేర్కొన్నారు.
మరో వైపు రజనీకాంత్ అభిమానులు మాత్రం ఆందోళన చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లపై మండి పడుతున్నారు. రజనీకాంత్ మంచి మనసును అడ్డం పెట్టుకుని ఆయన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫ్యాన్స్ మండి పడుతున్నారు. గతంలో అజిత్, సూర్య, విజయ్, మణిరత్నం సినిమాల విషయంలోనూ ఈ డిస్ట్రిబ్యూటర్లు నష్ట పోయారు..అప్పుడెందుకు ఆందోళన చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి రజనీకాంత్ సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలు వస్తాయనే ఆశతో భారీగా చెల్లించి రైట్స్ సొంతం చేసుకున్నారు. అయితే సినిమా అనుకున్నంతగా ఆడక పోవడంతో పెట్టిన పెట్టుబడిలో దాదాపు 30 నుండి 40 శాతం నష్ట పోయారు. సినిమా అనేది వ్యాపారం. లాభ నష్టాలు సహజమే. దానికి రజనీకాంత్‌ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సబబు? ఒక వేళ లాభాలు వస్తే తిరిగి ఇచ్చేవారా? అంటూ అభిమానులు మండి పడుతున్నారు.
గతంలో తన సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను రజనీకాంత్ ఆదుకున్నారు. ఈనేపథ్యంలో లింగా మూలంగా నష్టాల పాలైన తమను కూడా ఆదుకోవాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే రజనీకాంత్ నుండి కానీ, నిర్మాత నుండి కానీ ఎలాంటి స్పందన లేక పోవడంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు చెన్నైలోని వల్లూరు కొట్టం వద్ద స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











