స్టార్ హీరోని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్.. సిగ్నల్ వద్ద కిడ్నాప్, నిరూపించగలరా!
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే విధంగా వివాదాలు సైతం ఏ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి. కొందరు ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారు. అందుకు కారణం ఈ చిత్రంలోని పాత్రలే. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా నటించాడు. సూపర్ డీలక్స్ చిత్రంతో విజయ్ సేతుపతి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.

ట్రాన్స్‌జెండర్ పాత్రలో
విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ట్రాన్స్ జెండర్ శిల్పా పాత్రలో నటించాడు. విజయ్ సేతుపతి విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. మరోమారు సూపర్ డీలక్స్ చిత్రంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరకడంతో అదరగొట్టేశాడు. దర్శకుడు త్యాగరాజ కుమారరాజకు ఇది రెండవ చిత్రం. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. కానీ కొన్ని వర్గాల ప్రేక్షకులు సూపర్ డీలక్స్ పై మండిపడుతున్నారు.

విమర్శలు
సాధారణంగా ఇలాంటి చిత్రాలకు విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. ఇందులో కథ కథనాలు విచిత్రమైన అంశాలతో కూడుకున్నవి అని, నిజజీవితంలో వినడానికి కూడా అసహ్యించుకునే కొన్ని సన్నివేశాల్ని ఈ చిత్రంలో చూపించారని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి పాత్రపై కొందరు ట్రాన్స్ జెండర్స్ మండిపడుతున్నారు. తమని ఈ చిత్రంలో నేరాలకు పాల్పడే వారిగా అసభ్యకరమైన రీతిలో చూపించారని అంటున్నారు.

అరెస్ట్ చేయాలి
ఈ చిత్రంలో ఉండే ఓ సన్నివేశంపై ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సిగ్నల్ వద్ద ఉండే ఇద్దరు చిన్న పిల్లలని విజయ్ సేతుపతి కిడ్నాప్ చేసి వారిని అమ్మేస్తాడు. అసలు నిజజీవితంలో ఏ ట్రాన్స్ జెండర్ అయినా ఇలాంటి నేరాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. తమని అసభ్యకరమైన రీతిలో చూపించేందుకు కారణమైన విజయ్ సేతుపతి శిక్షార్హుడు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలి అని ట్రాన్స్ జెండర్స్ డిమాండ్ చేస్తున్నారు.

గౌరవం ఉంది
మంచి నటుడిగా తమకు విజయ్ సేతుపతిపై గౌరవం ఉంది. కానీ విజయ్ సేతుపతి సూపర్ డీలక్స్ కథ వినగానే రిజెక్ట్ చేసి ఉండాలి. ఈ చిత్రంలో నటించి అతడు తప్పు చేశాడు అని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అంటోంది. తాము గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు నిరూపించగలరా అని ప్రశ్నిస్తున్నారు. సూపర్ డీలక్స్ లో సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. రమ్యకృష్ణ పోర్న్ స్టార్ గా నటించింది.


Click it and Unblock the Notifications











