ఉత్కంఠ రేపుతున్న హీరోయిన్ త్రిష 60వ మూవీ ట్రైలర్
హీరోయిన్ త్రిషకు ఈ రోజు(మే 4) ఎంతో ప్రత్యేకమైన రోజు... ఈ చెన్నై బ్యూటీ నేటితో 36వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఆమె పుట్టినరోజు పురస్కరించుకుని 'పరమపదం విలయాట్టు' మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది త్రిష కెరీర్లో 60వ చిత్రం.
17 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన త్రిష వరుస విజయాలు అందుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో పాతుకుపోయారు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. రజనీకాంత్, చిరంజీవి ఇలా అందరు హీరోల సరసన నటించారు.

ఈ మధ్య కాలంలో త్రిష హారర్ కామెడీ, కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు, లేడీ ప్రధానమైన సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు చేయలేదు. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'పరమపదం విలయాట్టు' ఆమెకు తొలి పొలిటికల్ థ్రిల్లర్.
ఈ చిత్రంలో త్రిష... గాయిత్రి అనే డాక్టర్ పాత్రలో, చెవిటి, మూగ సమస్య గల కూతురుకు తల్లిగా నటిస్తోంది. రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గకుండా ధైర్యంగా తన వైద్య వృత్తిని కొనసాగించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే కాన్సెప్టుతో ఈ చిత్రం సాగుతుంది.
ఈ చిత్రానికి కె తిరుజ్ఞానం దర్శకత్వం వహిస్తున్నారు. 24 హవర్స్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె దినేష్ సినిమాటోగ్రఫీ అందించారు. అమ్రిష్ సంగీతం అందించారు. త్రిషతో పాటు నంద, రిచర్డ్, ఎఎల్ అళగప్పన్, వేల రామ్మూర్తి, చామ్స్, సోనా తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











